హైదరాబాద్: విశ్వవిద్యాలయాలు ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలని గవర్నర్, విశ్వవిద్యాలయాల చాన్సలర్ నరసింహన్ విశవిద్యాలయాల వైస్ చాన్సలర్లకు సూచించారు. సోమవారం హైదరాబాదులోని జూబిలీహాల్ లో ఏర్పాటైన విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. వైస్ చాన్సర్లకు మార్గదర్శక సూత్రాలను నిర్దేశించారు. విశ్వవిద్యాలయాలు స్వయంప్రతిపత్తిని కోరుకుంటే దానికి అనుగుణంగా జవాబుదారీతనం కూడా ఉండాలని ఆయన అన్నారు. విశ్వవిద్యాలయాల్లో పరిస్థితులపై మూడు నెలలకు ఒకసారి నివేదికలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా చూడాలని, అందుకు ఏ విధమైన విఘాతం కలిగినా వైస్ చాన్సర్లదే బాధ్యత అని ఆయన అన్నారు.
దేశం యావత్తూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల వైపు చూస్తోందని, వారిని సరైన మార్గంలో నడిపే బాధ్యత విసీలదేనని ఆయన అన్నారు. విశ్వవిద్యాలయాలు డిగ్రీలు ఇచ్చే సంస్థలే కాకుండా ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దే సంస్థలుగా కూడా పని చేయాలని ఆయన అన్నారు. గుర్తింపు లేని కోర్సులు నిర్వహిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి