హైదరాబాద్: తెలంగాణ జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ పై తెలుగుదేశం సీమాంధ్ర నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిందులు తొక్కారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న రాజకీయ నాయకులు ఆస్తుల వివరాలు లెక్కిస్తున్నామని కోదందరామ్ చేసిన ప్రకటనపై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మండిపడ్డారు. ఏ హోదాలో కోదండరామ్ ఆ ప్రకటన చేశారని ఆయన అడిగారు. ఆంధ్రవారి ఆస్తులు లెక్కిస్తామని కోదండరామ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బ్లాక్ మెయిల్ చేస్తున్న కోదండరామ్ పై విశ్వవిద్యాలయ చాన్సలర్ హోదాలో గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న కోదండరామ్ కు అటువంటి ప్రకటనలు చేయడం తగదని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు కె చంద్రశేఖర రావు, హరీష్ రావు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుండడం వల్లనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన విమర్సించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో యాదగిరి ఆత్మహత్య అందరినీ కలచివేసిందని ఆయన అన్నారు. తెలంగాణ వస్తే కుటుంబానికి ఒక ఉద్యోగం, మూడు ఎకరాల భూమి ఇస్తామని ఆశ పెట్టడం వల్లనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలకు కెసిఆర్ బాధ్యత వహించాలని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి