న్యూఢిల్లీ: విప్రోలో 4 మిలియన్ డాలర్ల అక్రమాల కేసు నిందితుడైన ఆ సంస్థ ఉద్యోగి అనూప్ అగర్వాల్ మరణించాడు. అతను ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. బ్లూమ్ బెర్గ్ యుటివి ఈ విషయాన్ని బయటపెట్టింది. కాగా, ఆర్థిక అక్రమాలపై విప్రో ఆడిట్ కమిటీ సోమవారం సాయంత్రం సమావేశమవుతున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అగర్వాల్ కంపెనీ ఆర్థిక శాఖ కంట్రోలర్ షిప్ విభాగంలో పనిచేస్తూ వస్తున్నాడు. ఈ విభాగం సంస్థ ఆర్థికపరమైన పుస్తకాలను భద్రపరుస్తుంది. అవసరమైనప్పుడు చెల్లింపులు జరిపే అధికారం కూడా దీనికి ఉంది.
విప్రో ఖాతా నుంచి అగర్వాల్ 4 మిలియన్ డాలర్ల సొమ్మును పాస్ వర్డ్ ను దొంగిలించి బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి సంస్థ కంట్రోలర్ షిప్ విభాగాన్ని నిలిపేసింది. నిర్లక్ష్యానికి ఆరుగురు ఉద్యోగులను తొలగించింది. అంతర్గత దర్యాప్తును చేపట్టడంతో పాటు బయటి ఆడిటర్ల, దర్యాప్తు నిపుణుల సహకారం తీసుకుంది. లొసుగులను కనిపెట్టడానికి, ప్రస్తుత ఆడిట్ అంచనాకు సంస్థ బయటి సంస్థను నియోగించింది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి