హైదరాబాద్: హైదరాబాద్ తెలంగాణలో భాగమేనని, కాదన్న వారు తెలివి తక్కువ వారని ఉత్తరాంధ్రకు చెందిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే కొన్నాళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే మంచిదేనన్న తన వ్యాఖ్యలను ఆయన మరోసారి మంగళవారం సమర్థించుకున్నారు. ప్రత్యేక వాదనలు పదే పదే ముందుకు రాకుండా పరిష్కారం లభించాలని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అభివృద్ధి కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరిగిందని ఆయన అన్నారు. ఎవరేమన్నా తాను పట్టించుకోనని, తన వాదన కొనసాగిస్తానని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన జరిగితే మంచిదేనన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలని ఆయన అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు చాలా వెనకబడి ఉన్నాయని ఆయన అన్నారు. తమకు ఎర్రంనాయుడు, అశోక్ గజపతి రాజు వంటి నాయకులుండడం దురదృష్టకరమని ఆయన అన్నారు. శాసనసభలో తీర్మానం పెడితే బలపరుస్తామని నిరుడు డిసెంబర్ ఏడవ తేదీన చెప్పిన రాజకీయ నేతలు ఆ తర్వాత మాట మార్చారని ఆయన విమర్సించారు.