టీడీపీ రాజ్యసభ సభ్యులు ప్రకటన, లాస్ట్ మినిట్ ట్విస్ట్- బుజ్జగింపులు..!!
టీడీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులను ఖరారు చేసారు. సుదీర్ఘ కసరత్తు తరువాత సీఎం చంద్రబాబు వీరి పేర్లను ప్రకటించారు. టీడీపీ నుంచి ముగ్గురు.. జనసేన నుంచి ఒకరు రాజ్యసభ కు ఎంపిక కానున్నారు. టీడీపీ బీసీ వర్గానికి ఒక సీటు ప్రకటించింది. రెండు పేర్లు ముందుగానే ఖరారు అయినా.. మూడో పేరు పైన సుదీర్ఘ కసరత్తు జరిగింది. చివరకు బీసీ.. ఉత్తరాంధ్ర నుంచి ఎంపిక చేయాలని నిర్ణయించారు. కాగా.. సీట్లు ఆశించి దక్కని వారిని పార్టీ నేతలు బుజ్జగించారు. భవిష్యత్ లో ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు.
తెలుగుదేశం రాజ్యసభ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. సానా సతీష్, బాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్లను రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసింది. ఈ ముగ్గురు అభ్యర్థులు సోమవారం తమ నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు పార్టీ ప్రకటించింది. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సానా సతీష్‌కు మరోసారి అవకాశం కల్పించారు. రాజ్యసభ సభ్యుడిగా సానా సతీశ్ ఏడాదిన్నార కాలమే పని చేయటంతో పాటుగా సామాజిక సమీకరణాల్లో భాగంగా మరో సారి రెన్యెవల్ చేసారు. ఇక గుంటూరుకు చెందిన టీడీపీ నాయకుడు బాష్యం రామకృష్ణకు తొలిసారి రాజ్యసభ అవకాశం లభించింది. 2024 ఎన్నికల ముందు ఆయనకు గుంటూరు పార్లమెంట్ టికెట్ దక్కుతుందని విస్తృతంగా ప్రచారం జరిగినప్పటికీ, ఆ సమయంలో అవకాశం రాలేదు. అయితే పార్టీ కోసం ఆయన చేసిన సేవలను గుర్తించిన అధిష్ఠానం ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయించింది.

మూడో అభ్యర్దిపై సుదీర్ఘ కసరత్తు.. ఖరారు
కాగా.. మూడో అభ్యర్ధి ఖరారు పైన సీఎం చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేసారు. బీసీ లేదా ఎస్సీ వర్గాలకు ఈ సీటు ఇవ్వాలని భావించారు. పలువురు ఆశావాహులు రేసులోకి వచ్చారు. చివరి నిమిషం వరకు ఎవరికి ఇవ్వాలనేది సంక్లిష్టంగా మారింది. జనసేన నుంచి లింగమనేనికి ఇవ్వటం తో టీడీపీ నుంచి బీసీకి సీటు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఉత్తరాంధ్రకు చెందిన బీసీకి ఇవ్వాలని నిర్ణయించటంతో చింతకాయల విజయ్ పేరు చివరకు ఖరారు చేసారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అయ్యన్నపాత్రుడు, విజయ్ ఇద్దరూ టీడీపీ తరఫున గట్టిగా పోరాటం చేశారు. అనేక రాజకీయ ఒత్తిళ్లు, కేసులు, వివాదాలు ఎదురైనా పార్టీని వీడకుండా కట్టుబాటుతో పనిచేశారు. ఈ నేపథ్యంలో పార్టీ వారి సేవలను గుర్తించి విజయ్‌కు రాజ్యసభ అవకాశం కల్పించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సీటు కోసం చివరి కోసం ప్రయత్నాలు చేసిన టీడీ జనార్ధన్, శ్రీనివాసరెడ్డి, కంభంపాటికి పార్టీ నేతలు బుజ్జగించారు. భవిష్యత్ లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications