గృహ వినియోగ వంట గ్యాస్ ధర భారీగా పెంపు, నేటి నుంచే అమలు..!!
మరోసారి సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. గృహ వినియోగదారులకు మరోసారి ఎల్‌పీజీ గ్యాస్ ధరల షాక్ తగిలింది. కొద్ది రోజులుగా వాణిజ్య సిలిండర్ల ధరలనే పెంచుతూ వస్తున్న ఆయిల్ కంపెనీలు ఇప్పుడు గృహ వినియోగ సిలిండర్ల ధరలను పెంచాయి. ఏకంగా రూ 29 మేర పెంచుతూ నిర్ణయం ప్రకటించాయి. ఈ రోజు నుంచే పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. గత మూడు నెలల కాలంలో ఈ ధరల పెంపు రెండో సారి. దీంతో... 90 రోజుల వ్యవధిలో ఒక్కో సిలిండర్ పైన దాదాపు రూ 67 చొప్పున భారం పెరిగింది.
గృహలకు వినియోగించే వంట గ్యాస్ ధరలను భారీగా పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఒక్కో సిలిండర్ పైన రూ 29 మేర పెంచుతున్నట్లు ప్రకటించాయి. మార్చి 7 వ తేదీన రూ 60 మేర పెంచిన ఆయిల్ కంపెనీలు, ఇప్పుడు మరో రూ 29 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసాయి. కొంత కాలంగా పెట్రోల్, డీజిల్ తో పాటుగా వంట గ్యాస్ ధరలు పెరుగుతాయని అంచనా వేసారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన వెంటనే వరుసగా మూడు విడతలుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారు. ఇప్పుడు గృహ వినియోగదారుల పైన భారం మోపుతూ వంట గ్యాస్ ధరలను పెంచారు. ఈ రోజు నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. దీంతో.. ఢిల్లీలో ప్రస్తుతం ఉన్న రూ 913 నుంచి రూ 942 కి పెరిగింది.

మూడు నెలల కాలంలో రెండు సార్లు పెంపు
దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భారం పెరుగుతున్న సమయంలో గృహ వినియోగదారుల పైనా భారం మోపక తప్పటం లేదని ఆయిల్ కంపెనీలు పేర్కొన్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో ఏర్పడిన అస్థిర పరిస్థితులు గ్యాస్ ధరలపై ప్రభావం చూపాయి. తాజా పెంపు కూడా అదే తరహా అంతర్జాతీయ కారణాల నేపథ్యంలో చోటుచేసుకున్నట్లు ఆయిల్ కంపెనీలు పేర్కొంటున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎల్‌పీజీ ధరలు గణనీయంగా పెరగడంతో కంపెనీలపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. గృహాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్ విక్రయంపై సుమారు రూ.703 వరకు నష్టం వస్తోందని పరిశ్రమ అంచనాలు వెల్లడిస్తున్నాయి. గతంలో పెంచిన రూ.60 పెంపు కూడా కంపెనీల నష్టాలను పూర్తిగా తగ్గించలేకపోయిందని చెబుతున్నారు . దీంతో అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మరోసారి ధరలను సవరించాల్సిన అవసరం ఏర్పడిందని వివరిస్తున్నాయి.













Click it and Unblock the Notifications