బంగాళాఖాతంపై తీవ్ర అల్పపీడనం- ఏపీలోని ఈ పట్టణాల్లో వర్షాలు: అలర్ట్ జారీ
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఏపీ తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. క్రమంగా ఇది బలపడుతోంది. బుధవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఆ తర్వాత మరింత విస్తరిస్తోంచే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఈ అల్పపీడనం వల్ల ఇప్పటికే కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. అవే పరిస్థితులు నేడు కూడా కొనసాగనున్నాయి.
ఈ క్రమంలో చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయింది. ఈ రెండు జిల్లాల్లోని నగరి, అగ్రం, పిచ్చాటూరు, విజయపురం, కన్నవరం, సత్యవేడు, పుత్తూరు, నిండ్ర ప్రాంతాలలో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడ్డాయి. నేడు కూడా ఆయా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.

నేడు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడొచ్చు. ఎన్టీఆర్, ప్రకాశం, బాపట్ల, మార్కాపురం, కడప, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, గుంటూరు వంటి జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఉరుములు, ఈదురుగాలులు వీస్తాయని, ఆ సమయంలో చెట్లు, భారీ హోర్డింగ్స్ కింద నిలబడకూడదని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
అలాగే.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ అయింది. ఆయా జిల్లాల్లోని వేపాడ, ఎస్ కోట, చోడవరం, అనకాపల్లి, విశాఖపట్నం, భోగాపురం, విజయనగరం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. నేడు కూడా అవే పరిస్థితులు కొనసాగవచ్చు. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయింది. మాడుగుల, చోడవరం, భీమునిపట్నం, అనంతగిరి, కొత్తవలస, అనకాపల్లి, విశాఖ పరిసర ప్రాంతాల్లో చెదురుమదురుగా కురిశాయి. నేడు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని, పిడుగులు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరింది.




Click it and Unblock the Notifications