తస్లీమా వ్యాసంపై ఘర్షణలు: ఇద్దరు మృతి

హసన్, బెల్గాం జిల్లాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ఘర్షణలకు కారణమైన వ్యాసాన్ని ప్రచురించిన పత్రికపై రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఏ మతానికి చెందిన వారి మనోభావాలను గాయపరిచేలా కథనాలు ప్రచురించినా, ప్రభుత్వం సహించదని సీఎం యడ్యూరప్ప హెచ్చరించారు. వివిధ వదంతులను నమ్మి ఉద్వేగానికి గురి కావద్దని ఆయన ముస్లింలకు పిలుపునిచ్చారు. షిమోగాలో సోమవారం మధ్యాహ్నం 1500 మంది ముస్లింలు తస్లిమా నస్రీన్ వ్యాసానికి వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహిస్తుండగా, హింస చెలరేగింది. రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మరణించారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో షిమోగాలో కర్ఫ్యూ విధించారు.
హసన్‌లోనూ అల్లరిమూకలు విధ్వంసకాండకు పాల్పడి వాహనాలకు, దుకాణాలకు నిప్పు పెట్టాయి. దీంతో పట్టణంతో పాటు, ముందు జాగ్రత్తగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఈ ఘర్షణలకు నిరసనగా శ్రీరామసేన మంగళవారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. కాగా ఆదివారం రాత్రి నుంచే మత ఘర్షణలతో అట్టుడుకుతున్న వాయవ్య జిల్లా బెల్గాంలోనూ కర్ఫ్యూ విధించారు. బెంగళూరు నగరం అంతటా ఐదు రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శంకర్ బిదరి ప్రకటించారు. హఠాత్తుగా చెలరేగిన ఈ మత ఘర్షణల వెనుక పెద్ద కుట్ర ఉందని షిమోగా ఎంపీ రాఘవేంద్ర ఆరోపించారు.












Click it and Unblock the Notifications