రాష్ట్రంలో విస్తరిస్తున్న రుతుపవనాలు, భారీ వర్షాలు- ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
ఏపీలో రుతుపవనాలు ప్రవేశించాయి. మరో రెండు రోజుల్లో తెలంగాణలోకి కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అటు మరి కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేసింది.
ఏపీలో ప్రవేశించిన రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక అంశాలను వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 12 వరకు అన్ని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈమేరకు రాష్ట్రానికి యెల్లో అలెర్ట్ జారీ చేసింది. మరోవైపు శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది. పలుచోట్ల మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మియాపూర్‌లో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. అలాగే నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దేవరకద్రలో అత్యధికంగా 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఖమ్మం జిల్లా మధిరలో అత్యధికంగా 42.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇప్పటి దాకా వేడి తీవ్రత, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్ నగర వాసులు శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో తడిసి ముద్దయ్యారు.

మూడు రోజులు పిడుగులు.. భారీ వర్షాలు
నగరంలో గంటన్నర పాటు కురిసిన వర్షంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. షేక్‌పేటలో 4.1 సెం.మీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై భారీగా నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. కాగా, అటు ఏపీలో దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లాలో కొంతవరకు విస్తరించాయి. 2, 3 రోజుల్లో మరికొన్ని జిల్లాలకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.












Click it and Unblock the Notifications