వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. ఈ వారం నుండే రూ.600 కోట్ల పరిహారం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలోని కరువు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సాగునీరు తాగునీరు అందించడానికి చేపట్టిన భారీ నీటిపారుదల ప్రాజెక్టు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ నుండి కృష్ణ వరద జలాలను నల్లమల కొండల క్రిందుగా నిర్మించిన రెండు భారీ సొరంగాల ద్వారా సాగర్ రిజర్వాయర్ కు దీని ద్వారా తరలిస్తారు.
వెలిగొండ ప్రాజెక్టుపై నిమ్మల రామానాయుడు శుభవార్త
మూడు జిల్లాలలోని ప్రజలకు, అన్నదాతలకు వరప్రదాయినిగా మారనున్న వెలిగొండ ప్రాజెక్టుపైన తాజాగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శుభవార్త చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు పరిహారం అందించే విషయమై ఆయన కీలక ప్రకటన చేశారు. రెండు విడతల్లో వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి మిగిలిన నిర్వాసితులకు 600 కోట్ల రూపాయల పరిహారాన్ని అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

రెండు విడతల్లో 4761 కుటుంబాలకు 600 కోట్ల రూపాయలు
తాజాగా విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రాజెక్టు పురోగతిపైన అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష చేసిన నిమ్మల రామానాయుడు మొత్తం 900 కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం ఇప్పటికే 2560 కుటుంబాలకు 318 కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాలలో జమ చేసింది. 4761 కుటుంబాలకు 600 కోట్ల రూపాయలను రెండు విడతల్లో చెల్లించనుందని ఆయన పేర్కొన్నారు.
రెండు విడతలలో చెల్లించాలని నిర్ణయం
మొదటి విడుదల 300 కోట్లు ఈ వారంలో, మూడు నుండి నాలుగు వారాలలో మరో 300 కోట్ల రూపాయలను అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్టుగా తెలిపారు. ఈ నెలాఖరులోగా ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామని నల్లమల సాగర్ జలాశయానికి కృష్ణా జలాలను విడుదల చేస్తామని ఆయన అన్నారు.
90 నుండి 99 శాతం వరకు పనులు పూర్తి
జగన్ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామని, మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ పనులను పూర్తి చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 90 నుండి 99 శాతం వరకు పనులు పూర్తయినట్టు తెలిపారు.
ఆగస్ట్ లోనే కృష్ణాజలాలు తీసుకెళ్ళేలా అన్ని చర్యలు
కొల్లం వాగు నుండి టన్నెల్ వరకు చేరే అప్రోచ్ ఛానల్, హెడ్ రెగ్యులేటర్ గేట్లు పూర్తయ్యాయని, టన్నెల్ 1, 2లలో 286 మీటర్ల సీసీ లైనింగ్ పనులు ఈనెల 18 లోగా పూర్తి చేస్తామన్నారు. ఈ ఆగస్ట్ లోనే కృష్ణా జలాలు తీసుకెళ్ళేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.



Click it and Unblock the Notifications