TTD: తిరుమలలో ఇక అన్నీ ఒకే చోట, సమస్యలకు చెక్ - కొత్త సదుపాయాలు..!!
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగుస్తున్న వేళ శ్రీవారి దర్శనం కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలను అమలు చేస్తోంది. ఇదే సమయంలో భక్తులకు దర్శనం.. వసతి సౌకర్యాలను పెంచేందుకు టీటీడీ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా తిరుమలలో పరిపాలనను సులభతరం చేయడానికి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుమలలో ఇక అన్ని కార్యాలయాలన్నీ ఒకే చోట ఏర్పాటు చేసి పాలనను సమన్వయం చేయడానికి టీటీడీ సంకల్పించింది. దీని కోసం 'సెంట్రల్ అడ్మినిస్ర్టేషన్ బిల్డింగ్' నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ. 85 కోట్లతో నిర్మించే ఈ భవంతికి టీటీడీ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుమలలో అనేక విభాగాలు విస్తృతంగా సేవలందిస్తున్నాయి. తిరుమలలో ప్రస్తుతం ఈ విభా గాల కార్యాలయాలు వివిధ చోట్ల ఉన్నాయి. దీంతో పరిపాలనలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పైగా, చాలా కార్యాలయాలు కాటేజీల్లో ఉన్నాయి. ఈ క్రమంలో అన్ని విభాగాలను ఒకే ప్రాంతంలో తీసుకువచ్చి సమర్థవంతమైన పరిపాలనతో భక్తులకు అదనపు వసతిని కూడా కల్పించవచ్చని టీటీడీ నిర్ణయించింది. మొత్తం 24 విభాగాలు ఒకే బిల్డింగ్ నుంచి పాలన సాగించేలా సదుపాయాలు కల్పించనున్నారు. తిరుమలలో అదనపు ఈవో కార్యాలయం, ఆలయ, అన్నప్రసాదం, కల్యాణకట్ట, పరకామణి, మ్యూజియం, అర్బన్ ప్లానింగ్ తదితర విభాగాలన్నీ ఒకే బిల్డింగ్‌లో ఉండేలా సెంట్రల్ అడ్మినిస్ర్టేషన్ బిల్డింగ్‌ను నిర్మించేందుకు బీ-టైప్ క్వార్టర్స్ ఉత్తరభాగంలో దాదాపు 1.35 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు.

పాలన మొత్తం తిరుమలలో ఒకే చోట నుంచి
దీంతో పాటుగా అక్కడ పార్కింగ్‌కు సౌకర్యంగా ఉంటుందని అధికారులు భావించారు. ఈ స్థలం రింగ్‌రోడ్డు, క్యూలైన్లు సమీపంలోనే ఉండటంతో అన్నింటికీ సౌకర్యంగా ఉంటుందని చెబుతున్నారు. తొలుత షాపింగ్ కాంప్లెక్స్ వద్దనున్న అన్నపూర్ణ క్యాంటీన్ భవనంలో పరిపాలన భవనాన్ని నిర్మించాలని గతేడాది జూన్‌లో బోర్డు నిర్ణయించినప్పటికీ ఆ స్థలం కేవలం 1,412 చదరపు మీటర్లు మాత్రమే ఉండటంతో అన్ని కార్యాలయాలు అక్కడకు తరలించడానికి, పార్కింగ్‌కు ఇబ్బందులు వస్తాయని అధికారులు గుర్తించి ఆ నివేదికను బోర్డుకు సమర్పించారు. దీంతో బీ-టైప్ క్వార్టర్స్ ఉత్తరభాగంలో స్థలానికి మొగ్గు చూపారు. నాలుగు అంతస్థులుగా నిర్మించే కేంద్రీయ పాలన భవనాన్ని పూర్తిగా 'గ్రీన్ బిల్డింగ్'గా ఏర్పాటు చేయాలని టీటీడీ భావిస్తోంది. దీనిలో సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. పచ్చదనం ఉట్టిపడేలా భవనాన్ని నిర్మించనున్నారు. కార్యాలయాలతో పాటు మీటింగ్ హాల్స్, మినీ థియేటర్‌ను ఏర్పాటు చేస్తారు. డిజైన్లు పూర్తయిన తర్వాత త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా కసరత్తు కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications