కడప: రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమని కడప కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అన్నారు. మాట మీద నిలబడినవారే రాజకీయాల్లో రాణిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. కడప ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో ఆయన మంగళవారం మాట్లాడారు. రాజకీయాలకు అసలైన అర్థం విశ్వసనీయతేనని ఆయన అన్నారు. రాజకీయాల్లో అడుగు పెట్టే ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. కష్టాల్లోనూ నష్టాల్లోనూ మాట నిలబడాలని ఆయన సూచించారు. ఆర్ట్స్ కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
యువతకు అది చేశాం, ఇది చేశామని రాజకీయ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారే గానీ నిజంగా యువతను గుర్తించి వారికి మేలు చేసినవారు ఎవరైనా ఉన్నారంటే అది దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మాత్రమేనని ఆయన ఆయన అన్నారు. చదువు కోసం, అనారోగ్యానికి గురైనప్పుడు చికిత్స కోసం అప్పులు చేస్తుంటారని, ఈ రెండు విషయాల్లో ఆర్థికంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా వైయస్ ఏర్పాట్లు చేశారని, ఈ రకంగా చేసినవారెవరూ లేరని ఆయన అన్నారు.