మహిళా బిల్లు: యుపిఎకు మద్దతు వెనక్కి

దళితులు, మైనారిటీల ప్రయోజనాలను పట్టించుకోనందున తాము మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ చెప్పారు. పార్లమెంటులో సంయుక్తంగా నిరసన వ్యక్తం చేసిన అనంతరం ములాయంతో పాటు లాలూ ప్రసాద్ యాదవ్ యుపిఎకు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. జెడి (ఎస్) నేత దేవెగౌడ కూడా ప్రస్తుత రూపంలో మహిళా బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ఒబిసి కోటా ఉండాలని ఆయన అంటున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్లమెంటులో ప్రవేశపెట్టదలిచిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు మెజారిటీ సభ్యుల మద్దతు లభిస్తుందని. కాంగ్రెసు, బిజెపి, వామపక్షాలతో పాటు ఎన్సీపి, తెలుగుదేశం, డిఎంకె, అన్నాడియంకె, అకాలీదళ్, బిజెడి, నేషనల్ కాన్ఫరెన్స్ వంటి చిన్న పార్టీల సభ్యులు, స్వతంత్రులు బిల్లును బలపరుస్తున్నారు.
కాగా, జెడి (యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ మహిళా బిల్లుపై పార్టీలో ఏకాభిప్రాయం సాధించలేకపోతున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బిల్లును సమర్థిస్తుండగా, శరద్ యాదవ్ వ్యతిరేకిస్తున్నారు. సోమవారం ఉదయం జరిగిన పార్టీ సమావేశం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. బిల్లు ఆమోదం పొందడానికి రాజ్యసభలో 155 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, 165 దాకా మద్దతు తెలుపుతున్నారు. బిల్లు ఆమోదం పొందుతుందనే నమ్మకంతో ప్రభుత్వం ఉంది.