న్యూఢిల్లీ: విద్యార్థులపై కేసుల ఎత్తివేత విషయంలో ముఖ్యమంత్రి రోశయ్యతో మాట్లాడి పరిష్కరిస్తానని కేంద్ర హోం మంత్రి పి చిదంబరం కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులకు హామీ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు గురువారం చిదంబరాన్ని కలిశారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న ఉద్యమాల నేపథ్యంలో విద్యార్థులపై పెట్టిన కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని వారు కేంద్ర మంత్రిని కోరారు.
స్వాతంత్ర్య సమరయోధుల పింఛన్ల సమస్యలను కూడా సత్వరమే పరిష్కరించాలని కూడా వారు చిదంబరాన్ని కోరారు. ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత అన్ని సమస్యలను పరిష్కరిస్తానని చిదంబరం హామీ ఇచ్చినట్లు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తెలిపారు.