త్వరలో వీడియో పైరసీ నిరోధక సెల్

సమావేశం తరువాత సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు శ్యాంప్రసాద్, 'మా' అధ్యక్షుడు మురళీమోహన్, అల్లు అరవింద్, ఎమ్మెల్యే జయసుధ, సురేష్ బాబు, పరుచూరితో కలిసి మంత్రి గీతారెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 38వేల వీడియో లైబ్రరీలున్నాయని, మూడునెలల్లో వీటికి లైసెన్సులు ఇచ్చి క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. "లైసెన్సు తీసుకున్న నిర్వాహకులు అధికారికంగా విడుదల చేసిన సినిమాలను మాత్రమే తమ వద్ద ఉంచుకోవాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే..లైసెన్సు రద్దుచేయడంతో పాటు జైలుశిక్ష విధించేలా చట్టంలో మార్పులు తీసుకొస్తాం. వీడియో పైరసీ అరికట్టేందుకు ప్రస్తుతం డీఎస్పీ స్థాయి అధికారికి మాత్రమే అర్హత ఉంది. ఇకనుంచి ఎస్సై స్థాయి అధికారికి తనిఖీ చేసే అధికారం ఇస్తాం. పైరసీ చట్టం కింద అరెస్టయిన వారికి బెయిల్ తీసుకునే అవకాశంలేకుండా చట్టం తీసుకువస్తాం. గూండా చట్టం కింద కేసులు నమోదు చేస్తాం. పైరసీని అరికట్టేందుకు మరో పదిరోజుల్లో కొత్త చట్టం తీసుకొస్తాం. లేకుంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి సిద్ధం చేస్తాం" అని ప్రకటించారు.
పైరసీపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొనేందుకు సమ్మతించడంతో నిర్మాత యలమంచి రవిచంద్ ఆమరణ దీక్షను విరమించారు. అల్లు అరవింద్ నిమ్మరసం ఇచ్చి రవిచంద్‌తో దీక్ష విరమింపజేశారు. ఆయనతోపాటు గురువారం దీక్ష చేపట్టిన నటి కల్యాణి, దర్శకులు సూర్యకిరణ్, ఎ.ఎస్.రవికుమార్‌చౌదరి విరమించుకున్నారు. తెలుగుచిత్ర పరిశ్రమ శుక్రవారం తలపెట్టిన బంద్‌ను విరమించుకొంది.












Click it and Unblock the Notifications