నేడు భీమవరం, కిర్లంపూడికి వైఎస్ జగన్: ముద్రగడ భౌతికకాయానికి నివాళి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు భీమవరం, కిర్లంపూడిలో పర్యటించనున్నారు. ముందుగా భీమవరం వెళ్లనున్నారు. అక్కడ ఆక్వా రైతులతో సమావేశం కానున్నారు. వారి సమస్యలు, ఫీడ్ ధరల పెంపు, గిట్టుబాటు ధరలు, ఆక్వా రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించనున్నారు. తమ ప్రభుత్వంలో అందజేసిన ఆర్థిక సహాయం, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించనున్నారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరిపై మాట్లాడనున్నారు.
అనంతరం వైఎస్ జగన్ నేరుగా కిర్లంపూడికి వెళ్తారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి నివాళులు అర్పిస్తారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేయనున్నారు. ఈ ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి భీమవరం చేరుకుంటారు వైఎస్ జగన్.

భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశం కానున్నారు. వారి సమస్యలు, ఫీడ్ ధరల పెంపు, గిట్టుబాటు ధరలు తదితర అంశాలపై చర్చిస్తారు. మధ్యాహ్నం సుమారు 1.30 గంటలకు భీమవరం నుంచి హెలికాప్టర్‌లో జగ్గంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కిర్లంపూడికి చేరుకుంటారు. ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి నివాళి అర్పిస్తారు. ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు. అనంతరం అక్కడి నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణమవుతారు.
ఈ రెండు పర్యటనల్లో ఆయన వెంట మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజాతో పాటు గోదావరి జిల్లాలకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కిర్లంపూడికి వెళ్లనున్నారు. ఇప్పటికే జగన్ ముద్రగడ పద్మనాభం కన్నుమూత పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ముద్రగడ గిరికి ఫోన్ చేసి పరామర్శించారు.
ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజల కోసం ముద్రగడ పద్మనాభం చేసిన సేవలు చిరస్మరణీయమని వైయస్ జగన్ కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, సామాజిక న్యాయం కోసం ఆయన జీవితాంతం నిబద్ధతతో పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ముద్రగడ పద్మనాభం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications