హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హరి ఎపిసోడ్: బాబు తెలంగాణ వ్యూహం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తెలంగాణ పర్యటనకు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. తన తెలంగాణ పర్యటనకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఆయన ముందుగానే ఓ వ్యూహాన్ని రచించి అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే హరికృష్ణ, ఎర్రబెల్లి దయాకర్ రావు వివాదం ముందుకు వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తెలంగాణ పర్యటనపై వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. సీమాంధ్ర నేతల తెలంగాణ పర్యటనకు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రసంగాలకు తెలంగాణవాదులు ఆటంకం కల్పించారు. అలాగే, నల్లగొండ జిల్లా మిర్యాలగుడా పర్యటనలో చంద్రబాబు కూడా వ్యతిరేకత తప్పలేదు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును టార్గెట్ చేయడం ద్వారా తెలంగాణ పర్యటనలకు ఆటంకం లేకుండా చేసుకోవాలనే ప్రయత్నం సీమాంధ్ర నేతల నుంచి జరుగుతూ వచ్చింది. కానీ చంద్రబాబు కొత్త ఎత్తుగడకు తెర తీశారు.

తెలంగాణలో వైయస్ జగన్ పర్యటనను అడ్డుకుంటామని తమ పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర రావు చేసిన హెచ్చరికను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు చంద్రబాబు తన బావమరిది, సమైక్యవాది హరికృష్ణను రంగంలోకి దింపారని అంటున్నారు. పార్టీ వేదికలపైనో, ప్రైవేటుగానో ఎర్రబెల్లి వ్యవహారాన్ని హరికృష్ణ తప్పు పట్టకుండా బహిరంగ లేఖ రాయడం వెనక చంద్రబాబు వ్యూహం ఉందని అంటున్నారు. తెలంగాణలో సీమాంధ్ర పర్యటనలకు అనుమతి సాధించడంలో పార్టీలకు అతీతంగా ఉన్నామనే భావనను హరికృష్ణ కల్పించి పెట్టారు. జగన్ పర్యటన విషయంలో హరికృష్ణ ప్రకటన చేయడం అందులో భాగమే. భవిష్యత్తులో తన పర్యటనకు కాంగ్రెసు మద్దతు కూడగట్టుకోవడానికే హరికృష్ణ చేత జగన్ పర్యటనను సందర్భంగా ఎంచుకుని బహిరంగ లేఖ రాయించారని అంటున్నారు.

తెలంగాణలో 12 శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు జరగనుండడం, స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా గడువు సమీపిస్తుండంతో రాష్ట్ర నాయకులుగా ఉన్న సీమాంధ్ర నాయకులకు తెలంగాణలో పర్యటించాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో భాగంగానే ఒక్కొరొక్కరు తెలంగాణలో విస్తృతంగా పర్యటించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రోశయ్య వివిధ కార్యక్రమాల ద్వారా తెలంగాణలో పర్యటిస్తుండడం ఇందుకు ఉదాహరణ. అలాగే, వైయస్ జగన్ మెల్లగా తెలంగాణలో కాలు పెట్టేందుకు ఓదార్పు యాత్రను ఎంచుకున్నారు. చంద్రబాబు మాత్రం పూర్తిగా పరిస్థితి చక్కబడిన తర్వాత తెలంగాణలో పర్యటించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. హరికృష్ణ వ్యవహారం ద్వారా పరిస్థితి తనకు మరింత అనుకూలంగా మార్చుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X