హరీ! నెహ్రూ బొమ్మ దగ్గర ముక్కు నేలకు రాస్తవా: కె చంద్రశేఖర రావు

తాము కూడా జననీ జన్మ భూమిశ్చ..స్వర్గాదపీ గరీయసీ సిద్ధాంతం కోసమే పోరాటం చేస్తున్నామని, దానికి గావుకేకలు, పెడబొబ్బలు దేనికని ప్రశ్నించారు. తామేమీ టీడీపీని టార్గెట్ చెయ్యలేదని, ప్రజలే టార్గెట్ చేశారని ఆయన అన్నారు. కర్రు కాల్చి వాత పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పక్కా ఆంధ్రా పార్టీ అని ఆయన అన్నారు. 'మీ పార్టీలో ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రజలు సీఎంలు అవడం సాధ్యపడదు. పార్టీ అధ్యక్షుడవడానికి అంతకన్నా అవకాశం లేదు. కనీసం టీడీఎల్పీ నేత పదవి అయినా ఇవ్వచ్చు గదా! మీరు పల్లకీలో కూర్చుంటే మోయాలా? ఇదేనా ఆత్మగౌరవం? లోక్‌సభ స్పీకర్, అంబాసిడర్ అవకాశాలు వచ్చినప్పుడు ఆంధ్రా, రాయలసీమ వాళ్లకే ఇచ్చారు. పార్టీ పుట్టినప్పుడు నిర్మాణంలో బండ చాకిరీ చేశామని, అది మా అర్హత..హక్కు అని పేర్కొన్నారు. 'తెలంగాణ ఓట్లు తీసుకుని తెలంగాణను ఎండబెట్టింది మీరు. మీ చర్యలకు విసుగెత్తి..క్యాబినెట్లో ప్రొటెస్ట్ చేసి..పార్టీ పదవులు ముఖాన విసికొట్టి బయటికొచ్చిన' అన్నారు.
ఎన్టీఆర్ హయాంలో 610 జీవోను జారీ చేశారని చెబుతున్నారని, అది అమలైందా అని ప్రశ్నించారు. రాయలసీమ నుంచి తెలంగాణ వాళ్లను పంపించే 564 జీవోను మాత్రం మూడు నెలల్లో అమలు చేశారన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయిందే టీడీపీ అని, నిజామాబాద్‌లో మైనారిటీ అభ్యర్థిని పెట్టి వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత పడుకున్న కాంగ్రెస్ నేతలను నిద్ర లేపి, సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమం సృష్టించిందే చంద్రబాబని అన్నారు. తెలంగాణలో ఆత్మహత్యలు, ఆకలిచావులు చంద్రబాబు హయాంలోనే ప్రారంభమయ్యాయన్నారు. 'ఎమ్మార్ ప్రాపర్టీస్ కు 2002లో ధారాదత్తం ప్రారంభమైందే బాబు హయాంలో. తర్వాత వైఎస్ కొనసాగించారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూములు పెద్దలకు కట్టబెట్టే విషయంలో చంద్రబాబు కిటికీలు తెరిస్తే..వైఎస్ ఏకంగా దర్వాజలే తెలిచారు' అని ధ్వజమెత్తారు.
బాంబులేసి రాయలసీమకు ఆర్డీఎస్ నీరు తీసుకెళ్తేంటే కేసు కూడా పెట్టలేదన్నారు. ఆయన చేసిన దుర్మార్గానికి 400 మంది తెలంగాణ విద్యార్థులు బలయ్యారని ఆరోపించారు. నక్సలైట్ల పేరు చెప్పి వందలాది మంది తెలంగాణ బిడ్డలను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టయినా ఉందా అని ప్రశ్నించారు. వ్యవసాయం దండగన్నారని, బషీర్‌బాగ్‌లో కాల్చి చంపారని, అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించారని విమర్శించారు. గత ఎన్నికల్లో పొత్తు పేరు మీద తమ పార్టీని మోసం చేసింది తెలుగుదేశం పార్టీయేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications