ఈనాడు, ఆంధ్రజ్యోతిలను దుయ్యబట్టిన సాక్షి డైలీ

ఓదార్పు యాత్రలో కాంగ్రెసు నేతలెవరూ పాల్గొనరాదని హైకమాండ్ ఆదేశించినట్టు రెండు రోజులుగా తప్పుడు ప్రచారం సాగిస్తున్నాయని సాక్షి దినపత్రిక విరుచుకుపడింది. ఢిల్లీలో హై డ్రామా ... అంతా అబద్ధమని తేలడంతో తుస్సుమన్న లీకువీరులని వ్యాఖ్యానించింది. ఓదార్పు యాత్రకు వెళ్లొద్దని అధిష్టానం ఆదేశించిందంటూ శుక్రవారం సాయంత్రం ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. అలాగే, ఓదార్పు యాత్రకు వెళ్లొద్దని తన మాటగా ప్రజాప్రతినిధులకు, నాయకులకు చెప్పాలని సోనియా గాంధీ రాష్ట్రానికి చెందిన ఓ కేంద్ర మంత్రితో అన్నట్లు కూడా ఆ వార్తాకథనం ప్రసారమైంది. దానిపై సాక్షి దినపత్రిక తీవ్రంగా మండిపడింది. ఆ రెండు దినపత్రికలు గత రెండు రోజులుగా జగన్ పై విషప్రచారం చేస్తున్నాయని ఆరోపించింది.
ఆ రెండు దినపత్రికల కథనాలపై కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ మండిపడినట్లు సాక్షి దినపత్రిక రాసింది. చెత్త కథనాలు.. నిరాధార కథనాలు... ఇష్టమొచ్చినట్లు రాసేయడం, ప్రసారం చేయడం.. వీటిపై మీరొచ్చి నన్ను అడగడం.. మీకు వేరే పని లేదా అని మొయిలీ మండిపడినట్లు సాక్షి దినపత్రిక రాసింది. ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని ఆదేశాలు జారీ కాలేదని పలువురు పార్లమెంటు సభ్యులు చెప్పినట్లు కూడా సాక్షి దినపత్రిక రాసింది. ఈ రెండు సంస్థల వార్తాకథనాల వల్ల తెలుగు మీడియా పరువు జాతీయ స్థాయిలో పోయిందని సాక్షి దినపత్రిక ఆవేదన వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications