నిరుద్యోగ భారతం: లేబర్ రిపోర్ట్‌లో బయటపడ్డ చేదు నిజాలు!
దేశంలో జాబ్ మార్కెట్ మిశ్రమ ఫలితాలను చూపిస్తోంది. జాతీయ గణాంకాల కార్యాలయం (NSO) విడుదల చేసిన తాజా 'పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే' (PLFS) వివరాల ప్రకారం.. గత జూన్ నెలలో దేశంలో నిరుద్యోగిత రేటు ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా 5.5 శాతంగానే నమోదైంది. ఒకవైపు నగరాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, దేశీయ శ్రమశక్తిలో మహిళల భాగస్వామ్యం గత 12 నెలల కనిష్ట స్థాయికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (LFPR) జూన్ నెలలో 54.4 శాతంగా నమోదైంది. అయితే, మహిళా కార్మిక భాగస్వామ్య రేటు మాత్రం మే నెలలోని 32.8 శాతం నుంచి జూన్ నాటికి 32.7 శాతానికి స్వల్పంగా పడిపోయింది.

గత ఏడాది జూన్ (2025)లో ఇది 32.0 శాతంగా ఉండగా, ఆ తర్వాత ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది జనవరిలో మహిళల భాగస్వామ్యం అత్యధికంగా 35.3 శాతానికి చేరినప్పటికీ, ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోంది.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఉపాధి భాగస్వామ్యం 36.7 శాతం నుంచి 36.6 శాతానికి తగ్గడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అదే సమయంలో పట్టణ ప్రాంత మహిళల భాగస్వామ్యం ఎటువంటి మార్పు లేకుండా 24.8 శాతంగానే కొనసాగింది. అయితే, గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే మహిళల భాగస్వామ్య రేటు 0.7 శాతం మేర మెరుగ్గా ఉండటం గమనార్హం.
పట్టణాల్లో పెరిగిన ఉపాధి..
ఉపాధి రంగంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో కార్మిక శ్రమశక్తి భాగస్వామ్యం మే నెలలోని 49.8 శాతం నుంచి జూన్‌లో 50.1 శాతానికి పెరిగింది. అలాగే నగరాల్లో కార్మికుల జనాభా నిష్పత్తి కూడా 46.8 శాతానికి చేరడంతో, నగరాల్లో కొత్త ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నట్లు స్పష్టమవుతోంది. అయినప్పటికీ, పట్టణ నిరుద్యోగిత రేటు మాత్రం 6.4 శాతం నుంచి 6.6 శాతానికి పెరిగింది.
గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే, నిరుద్యోగ రేటు స్వల్పంగా తగ్గి 5.0 శాతానికి పరిమితమైంది. ఫిబ్రవరి నెల నుంచి గ్రామీణ నిరుద్యోగిత నిరంతరం పెరుగుతూ రాగా, జూన్ నెలలో ఈ రేటు మే నెలకు (5.1 శాతం) తో పోలిస్తే కొద్దిగా తగ్గడం గ్రామీణ ప్రజలకు కొంత ఊరటనిచ్చే అంశం.
పురుషుల ఉపాధిలో పురోగతి..
మహిళలతో పోలిస్తే పురుషుల ఉపాధి గణాంకాలు ఈ నెలలో మెరుగ్గా ఉన్నాయి. మే నెలలో 72.5 శాతంగా ఉన్న పురుషుల శ్రామిక జనాభా నిష్పత్తి జూన్ నాటికి 72.9 శాతానికి పెరిగింది. అదే సమయంలో పురుషుల నిరుద్యోగిత రేటు కూడా 5.4 శాతం నుంచి 5.3 శాతానికి స్వల్పంగా తగ్గడం సానుకూల పరిణామంగా చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications