తెలంగాణలో SIR గందరగోళం నుంచి భారీ ఉపశమనం: కొంత వెసలుబాటు
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) తుదిదశకు వచ్చిన వేళ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వీటి తేదీలను సవరించింది. దీనివల్ల అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండిన యువతకు ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ఓ మంచి అవకాశం లభించినట్టయింది. తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా ఎస్ఐఆర్ గడువును పొడిగించింది ఈసీ. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారుల అభ్యర్థన మేరకు ఈ కీలక మార్పులు చేస్తూ ఈసీ అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ సవరించిన సరికొత్త తేదీల విషయంలో సంబంధిత జిల్లా ఎన్నికల అధికారులు, బూత్ స్థాయి సిబ్బందికి తగిన సన్నద్ధత కల్పించాలని ఎన్నికల కమిషన్ పేర్కొంది. రాజకీయ పార్టీలకు ఈ మార్పులు రాతపూర్వకంగా తెలియజేయాలని సూచించింది. సాధారణ ఓటర్లకు కూడా ఈ నూతన గడువులపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని స్పష్టం చేసింది.

తెలంగాణ వ్యాప్తంగా సవరించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 25 నుండి ఆగస్టు 3వ తేదీ వరకు బూత్ స్థాయి అధికారులు (BLO) ప్రతి ఇంటిని వ్యక్తిగతంగా సందర్శిస్తారు. కుటుంబాల వారీగా ఓటర్ల అర్హతలు, మరణించిన వారి సమాచారాన్ని క్షేత్రస్థాయిలో సేకరిస్తారు. సవరణలతో పాటు పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ఆగస్టు 3 నాటికి పూర్తి అవుతుంది. అదే నెల 10న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురిస్తుంది ఈసీ.
ఈ ముసాయిదా జాబితా విడుదలైన తరువాత ఓటర్లు తమ పేర్ల నమోదును క్షుణ్ణంగా పరిశీలించుకోవచ్చు. ఆగస్టు 10 నుండి సెప్టెంబర్ 9 వరకు కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి లేదా సవరణల కోసం అభ్యంతరాలను సంబంధిత కార్యాలయాల్లో సమర్పించవచ్చు. వీటిని ఎన్నికల అధికారులు నిశితంగా పరిశీలించి అక్టోబర్ 8 లోగా పరిష్కరిస్తారు. చివరగా అక్టోబర్ 12న ఓటర్ల తుది జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు.
కర్ణాటకలో కూడా ఎన్నికల సంఘం ప్రత్యేక సవరణ షెడ్యూల్‌ను సవరించింది. అక్కడ జూన్ 30 నుండి ఆగస్టు 8వ తేదీ వరకు బీఎల్ఓలు ఇళ్ల సందర్శన పూర్తి చేస్తారు. పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ పనులు కూడా ఈ ప్రక్రియలోనే పూర్తవుతాయి. తదనంతరం ఆగస్టు 17న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేస్తారు. అదే తేదీ నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు, కొత్త క్లెయిమ్ లు దాఖలు చేసుకునేందుకు గడువు ఉంటుంది.
వీటన్నింటినీ అక్టోబర్ 15 లోగా స్థానిక ఎన్నికల అధికారులు పరిష్కరిస్తారు. చివరగా అక్టోబర్ 19న కర్ణాటక తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. నకిలీ ఓట్లను తొలగించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు లభించేలా అత్యంత పారదర్శక పద్ధతిలో ఈ సవరణ ప్రక్రియను జరపనున్నారు. అర్హులైన యువత, అలాగే తమ నివాస ప్రాంతాలు మారిన వారు ఈ నూతన గడువులలోగా తగిన ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులను పూర్తి చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.














Click it and Unblock the Notifications