గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు మహర్ధశ. దసరా నాటికి మోదీ చేతుల మీదుగా..
విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయ ప్రగతిలో మరో కీలక మైలురాయి నమోదైంది. విమానాల రాకపోకలను మరింత సురక్షితంగా, వేగంగా పర్యవేక్షించేందుకు వీలుగా నూతనంగా నిర్మించిన అత్యాధునిక 'ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) టవర్-కమ్-టెక్నికల్ బ్లాక్' అందుబాటులోకి వచ్చింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు శనివారం ఈ నూతన విభాగాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ఈ సదుపాయం ద్వారా విమాన ట్రాఫిక్ నిర్వహణ సామర్థ్యం పెరగడంతో పాటు పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా భద్రతా ప్రమాణాలు మరింత బలోపేతం కానున్నాయి. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు ఎంపీలు కేశినేని చిన్ని, వల్లభనేని బాలశౌరి, విమానాశ్రయ అధికారులు పాల్గొన్నారు.

అడ్వాన్స్ టెక్నాలజీ..
కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ టెక్నికల్ బ్లాక్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (ATS), కమ్యూనికేషన్, నావిగేషన్, సర్వైలెన్స్ (CNS) వంటి కీలక విభాగాలకు కేంద్ర బిందువుగా మారనుంది. ఇందుకు అవసరమైన అన్ని రకాల చట్టబద్ధమైన, కార్యాచరణ, నియంత్రణ అనుమతులను అధికారులు ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేశారు. విమానాశ్రయంలోని వివిధ సాంకేతిక సేవల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు ఈ కొత్త వ్యవస్థ ఒక పటిష్టమైన వేదికను అందిస్తుందని మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రి, ఎంపీ చిన్నితో కలిసి నూతన ఏటీసీ టవర్ పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
దసరా కల్లా నూతన టెర్మినల్ సిద్ధం..
విమానాశ్రయంలో వేగంగా నిర్మాణమవుతున్న నూతన టెర్మినల్ భవన పనులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ చిన్ని స్వయంగా కార్మికులు, సిబ్బందితో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రయాణికులకు సకల సదుపాయాలు కల్పించే ఈ టెర్మినల్ నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ఈ ఏడాది దసరా పండుగ నాటికి నూతన టెర్మినల్‌ను సిద్ధం చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించుకునేలా ప్రణాళికలు వేస్తున్నామని, ఇందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు వెల్లడించారు.
విమాన సర్వీసుల జోరు.. శబరిమల భక్తులకు గుడ్ న్యూస్!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డబల్ ఇంజన్ వేగంతో గన్నవరం విమానాశ్రయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు పరుగులు పెడుతున్నాయని ఎంపీ కేశినేని చిన్ని కొనియాడారు. ఈ నెల 25 నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మరింత విస్తరిస్తోందని చెప్పారు. ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు సర్వీసులు పెంచడంతో పాటు ముంబైకి ప్రతిరోజూ రెండు ఫ్లైట్లు నడిచేలా ఏర్పాట్లు చేశామన్నారు. దీనికి అదనంగా ఆగస్టు 13 నుంచి వారణాసి, కోల్‌కతా నగరాలకు సైతం కొత్త సర్వీసులు ప్రారంభం కావడం శుభపరిణామన్నారు. రాబోయే రోజుల్లో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం కొచ్చిన్‌కు నేరుగా ఫ్లైట్ అందుబాటులోకి తీసుకురావాలని మంత్రిని ప్రత్యేకంగా కోరినట్లు ఎంపీ చిన్ని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications