వారసుడిని ప్రకటించిన మాయావతి
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బహుజన సమాజ్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలక మార్పులు చేపట్టింది. ఈ దిశగా పార్టీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇషాన్ ఆనంద్‌ను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా నియమించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి, క్షేత్రస్థాయిలో బలోపేతం కావడానికి ఈ నియామకం దోహదపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
లక్నోలో నిర్వహించిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా మాయావతి ఈ ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ కు త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడించారు. ఈ దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు.

ఇషాన్ ఆనంద్.. స్వయానా మాయావతి తమ్ముడి, బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడు ఆనంద్ కుమార్ తనయుడు. ఆనంద్ కుమార్ కు ఇద్దరు కుమారులు ఆకాష్, ఇషాన్. కొంత కాలంగా మాయావతితో కలిసి పలు రాజకీయ కార్యక్రమాల్లో కనిపించారు. పార్టీ అంతర్గత సమావేశాలు, కీలక విధాన నిర్ణయాల చర్చల్లో చురుగ్గా పాలుపంచుకుంటూ వస్తోన్నారు. ఇప్పుడు అధికారికంగా జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించడంతో పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది. భవిష్యత్తులో మాయావతి తర్వాతి స్థానంలో నిలిచి పార్టీ వ్యవహారాలను పూర్తిగా నడిపించేందుకు ఆయనకు ఈ అవకాశం లభించినట్లు తెలుస్తోంది.
ఇషాన్ ఆనంద్ కంటే ముందు ఆయన సోదరుడు ఆకాశ్ ఆనంద్.. బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఒకానొక దశలో ఆకాశ్‌ను మాయావతి తన రాజకీయ వారసుడిగా కూడా ప్రకటించారు. ఈ నెల 3వ తేదీన ఆయనను జాతీయ సమన్వయకర్త పదవి నుంచి మాయావతి అకస్మాత్తుగా తొలగించారు. ఆకాశ్ ఆనంద్ రాజకీయంగా మరింత పరిణతి సాధించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.
ఆ తర్వాత 10వ తేదీన ఆయనను పార్టీకి పూర్తిగా దూరం చేయడం చర్చనీయాంశమైంది. ఆకాశ్ ఆనంద్ దూరం కావడానికి కుటుంబ వ్యవహారాలు కూడా ఓ ప్రధాన కారణంగా నిలిచాయని తెలుస్తోంది. ఆకాశ్ మామ, మాజీ రాజ్యసభ ఎంపీ అశోక్ సిద్ధార్థ్ పార్టీ కంటే సొంత కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని మాయావతి ఆరోపించారు. అశోక్ సిద్ధార్థ్ రాజకీయ సన్యాసం గురించి మాయావతి చేసిన సోషల్ మీడియా పోస్టును ఆకాశ్ ఆనంద్ తిరిగి షేర్ చేయకపోవడం కూడా వీరి మధ్య విభేదాలకు దారితీసింది.
క్రమశిక్షణ విషయంలో ఎక్కడా రాజీపడని మాయావతి.. ఆకాశ్ స్థానంలో ఆయన తమ్ముడు ఇషాన్ ఆనంద్‌ను నూతన సారథిగా ప్రకటించారు. ఈ సంస్థాగత మార్పులు ఉత్తరప్రదేశ్‌కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా బీఎస్పీ క్యాడర్‌ను బలపరచడానికి ఉపయోగపడతాయని పార్టీ విశ్వసిస్తోంది.
క్షేత్రస్థాయిలో పార్టీ అనుబంధ విభాగాలను క్రియాశీలకం మార్చడం, కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేయడం ఇషాన్ ఆనంద్ ముందున్న ప్రధాన సవాళ్లు. మాయావతి తీసుకున్న ఈ నిర్ణయం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడిని పెంచింది. కొత్త నాయకత్వంతో క్షేత్రస్థాయిలో మరింత పట్టు సాధించడం ద్వారా రాబోయే ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని బీఎస్పీ భావిస్తోంది.













Click it and Unblock the Notifications
