గణేష్ నిమజ్జనం వేళ భక్తులకు గుడ్ న్యూస్.. రాత్రంతా నడవనున్న ఎంఎంటీఎస్ రైళ్లు
హైదరాబాద్ లో గణేష్ నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని గణేష్ మండపాల వద్ద ఓ వైపు పూజా పురస్కారాలు, అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు నిమజ్జన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక భాగ్య నగరంలోని ట్యాంక్ బండ్ పరిసరాల్లో వినాయకుడి నిమజ్జనాల సందడి ఆకాశాన్ని తాకుతోంది. భక్తుల కేరింతలు, ఆట పాటలు, డ్యాన్స్ ల నడుమ గణపయ్య నిమజ్జన కార్యక్రమాలు కోలాహలంగా సాగుతున్నాయి. ట్యాంక్ బండ్ వద్ద ప్రస్తుత వాతావరణం జాతరను తలపిస్తోంది. నవరాత్రులు పూర్తి అయిన నేపథ్యంలో భారీ సంఖ్యలో గణేష్ విగ్రహాలు ట్యాంక్ బండ్ వద్దకు తరలివస్తున్నాయి. అయితే గణేష్ నిమజ్జన సమయంలో తరలివచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. నిమజ్జన సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాత్రంతా ఎనిమిది ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లను నడపనున్నట్లు స్పష్టం చేసింది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయకుండా తాపీగా నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించే విధంగా ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.
గణేష్ నిమజ్జనాల నేపథ్యంలో భక్తుల భద్రత, సౌకర్యం దృష్టిలో పెట్టుకుని ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ఈ రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారిక సౌత్ సెంట్రల్ రైల్వేలో ప్రచురించింది. ఆ వివరాలు చూస్తే ట్రెయిన్ నెం. GSH-1 సికింద్రాబాద్ నుంచి రాత్రి 11 గంటల 50 నిమిషాలకు స్టార్ట్ అయి 12 గంటల 20 నిమిషాలకు హైదరాబాద్ లోని నాంపల్లి స్టేషన్ కు చేరుకుంటుంది. GHL-2 నాంపల్లి నుంచి రాత్రి 12 గంటల 30 నిమిషాలకు బయల్దేరి 1 గంట 20 నిమిషాలకు లింగంపల్లి చేరుకుంటుంది. GLH-3 అయితే 1 గంట 50 నిమిషాలకు లింగంపల్లి నుంచి బయల్దేరి 2 గంటల 40 నిమిషాలకు నాంపల్లి చేరుకుంటుంది. ట్రెయిన్ నెం. GHS-4 తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు లింగంపల్లి నుంచి స్టార్ట్ అయి 4 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. GHL-5 చూస్తే రాత్రి 11 గంటల 10 నిమిషాలకు నాంపల్లి నుంచి స్టార్ట్ అయి 11 గంటల 55 నిమిషాలకు లింగంపల్లిలో ఆగుతుంది.

ఇక ట్రైయిన్ నెం. GLF-6 చూస్తే రాత్రి 12 గంటల 10 నిమిషాలకు లింగంపల్లి నుంచి స్టార్ట్ అయి 1 గంట 50 నిమిషాలకు ఫలక్ నుమాకు చేరుకుంటుంది. అలాగే GFS-7 చూస్తే రాత్రి 2 గంటల 20 నిమిషాలకు ఫలక్ నుమా నుంచి బయల్దేరి 3 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. GSH-8 తెల్లవారుజామున 4 గంటలకు సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయి 4 గంటల 40 నిమిషాలకు నాంపల్లికి చేరుకుంటుంది. ఈ ఎనిమిది ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లు ప్రతి స్టేషన్ లో ఆగనున్నాయి. ఇక హైదరాబాద్ లో దాదాపు 1.5 లక్షల గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేయాల్సి ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో నగర వ్యాప్తంగా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు.












Click it and Unblock the Notifications
