ఏపీలో SIR పై కేంద్ర ఎన్నికల కమిషన్ తుది నిర్ణయం- హుటాహుటిన ఉత్తర్వులు జారీ
ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ పూర్తిగా సవరించింది. ఈ ప్రక్రియ గడువును పొడిగించింది. తాజా తేదీలను ప్రకటించింది. ఎన్నికల ప్రధానాధికారి పంపిన ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ఈ మార్పులు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేకు ఈసీ అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ తాజా ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ సవరణల వల్ల బూత్ స్థాయి అధికారులు మరింత సమర్థవంతంగా క్షేత్రస్థాయి పరిశీలనలు చేయడానికి తగిన వ్యవధి లభించనుంది.
గడువు ప్రకారం, బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను నిశితంగా పరిశీలించే ప్రక్రియ బుధవారం అంటే ఈ నెల 15వ తేదీన ప్రారంభమౌతుంది. ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ గడువులోగా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, నూతన కేంద్రాలను సరిదిద్దే పనులను కూడా అధికారులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం 31వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా అధికారికంగా వెల్లడి అవుతుంది.

ఆ రోజు నుంచే ఓటర్లు తమ వివరాల నమోదు, తప్పుల సవరణ, పేర్లు, ఇతర వివరాల్లో పొరపాట్లు, చిరునామా మార్పుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యంతరాల పరిష్కారానికి కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ గడువు మంజూరు చేసింది. క్లెయిమ్‌లు, అభ్యంతరాలను తెలియజేయడానికి నెల రోజుల గడువు ఇచ్చింది. అంటే ఈ నెల 31వ తేదీ నుండి ఆగస్టు 30వ తేదీ వరకు ఓటర్లు కేంద్ర ఎన్నికల కమిషన్ కు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు.
అదే సమయంలో అభ్యంతరాల పరిష్కారించడానికి రెండు నెలల గడువు ఉంటుంది. ఎన్నికల కమిషన్ తనకు అందిన అభ్యంతరాలను ఈ నెల జులై 31 నుండి సెప్టెంబరు 28వ తేదీ వరకు పరిష్కరిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం సంపూర్ణంగా ముగిసిన అనంతరం ఓటర్ల తుది జాబితా ఖరారు అవుతుంది. ఈ ఓటర్ల తుది జాబితాను ఈసీ అక్టోబరు 3వ తేదీన విడుదల చేస్తోంది.
ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియలో ఓటర్ల నుంచి వచ్చే అభ్యంతరాలు, దరఖాస్తుల పరిష్కారానికి దాదాపు రెండు నెలల సమయం కేటాయించారు. దీనివల్ల ఓటర్ల జాబితాలోని డూప్లికేట్ ఓట్లు, తప్పులు, మరణించిన వారి పేర్లను పూర్తిగా తొలగించే అవకాశం కలుగుతుంది. అక్టోబరు 3వ తేదీ నాడు నూతన ఓటర్ల తుది నివేదికను ప్రజల ముందుకు తీసుకువస్తుంది ఈసీ. తుది జాబితాను తన అధికారిక వెబ్ సైట్ లో పొందుపర్చుతుంది.
సవరించిన ఈ నూతన షెడ్యూల్ సమాచారాన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు రాతపూర్వకంగా తెలియజేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ తన తాజా ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు ఎన్నికల ప్రధానాధికారికి సూచనలు ఇచ్చింది. అంతేకాకుండా సవరించిన తేదీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించి, ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేయడమే ఈ సవరణల ముఖ్య ఉద్దేశం.












Click it and Unblock the Notifications