హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ ఏడాది డిసెంబర్ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అనుసరించే వ్యూహం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ నెలాఖరునాటికి శ్రీకృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర పరిస్థితిపై నివేదిక సమర్పించనుంది. ఆ కమిటీ నివేదిక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందా, లేదా అనేది సందేహమే. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నివేదిక సమర్పించినా సీమాంధ్ర నాయకులు దాని అమలును అడ్డుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. దీంతో శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎలా ఉన్నా మరోసారి పెద్ద యెత్తున ఆందోళనకు దిగాల్సిన పరిస్థితే ఉంటుంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటే మొత్తంగానే తెలంగాణ సాధన కోసం మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది. లేదంటే సీమాంధ్ర నాయకుల ఎత్తుగడలను, ఆందోళనలను తిప్పి కొట్టి కేంద్రం చేత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమం చేపట్టాల్సి ఉంటుంది. ఎలాగైనా ఆందోళన చేయాల్సిన అనివార్యత ఉండడంతో కెసిఆర్ ఇప్పటి నుంచే అందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
డిసెంబర్ తర్వాత భూకంపం పుట్టిస్తామని కెసిఆర్ పదే పదే చెబుతున్నారు. తెలంగాణ ఇవ్వకపోతే మానవ బాంబులుగా మారుతామని ఇటీవల కెసిఆర్ అన్నట్లు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వార్త వచ్చింది. దానిపై కేసిఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తాను అలా అనలేదని ఆయన చెప్పారు. అయితే, డిసెంబర్ తర్వాత చేపట్టే ఆందోళన శాంతియుతంగానే ఉండాలని కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు ఇటీవల అమెరికాలోని తెలంగాణ ఎన్నారైల సమావేశంలో చెప్పారు. శాంతియుతంగా ఉద్యమం చేపట్టినా అది ప్రభుత్వాన్ని స్తంభింపజేసేలా ఉండాలనేది కెసిఆర్ ఆలోచన. అందుకు పెద్ద యెత్తున సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టడమే మేలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే తాను మళ్లీ నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. అయితే, పార్టీ నాయకులు అందుకు అంగీకరించే అవకాశం లేదు. సహాయ నిరాకరణకే తెలంగాణలోని అన్ని సెక్షన్లను సిద్ధం చేయాలనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు.