హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారీ వర్షాలతో కోస్తాంధ్ర అతలాకుతలం: 12 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Heavy Rains
హైదరాబాద్: ఈశాన్య రుతుపవనాలకు బంగాళాఖాతంలో అల్పపీడనం తోడై కోస్తాంధ్రను వర్షాలు అతలాకుతలం చేశాయి. జనజీవనాన్ని స్తంభింపజేశాయి. లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. అనేక ఇళ్లు నేలకూలాయి. మొత్తం 12 మంది మరణించారు. తూర్పు గోదావరి జిల్లాలో నలుగురు, విశాఖపట్నం జిల్లాలో నలుగురు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు, నెల్లూరు జిల్లాలో మరొకరు మృత్యువాతపడ్డారు. తూర్పు గోదావరి జిల్లాలో మరో ఆరుగురు గల్లంతయ్యారు. అనేక వేల మంది నిరాశ్రయులయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు జిల్లాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. మంగళవారం కూడా వర్షాలు పడుతున్నాయి. మరో 24 గంటల పాటు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగే అవకాశం ఉంది. గత 24 గంటల నుంచి కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. అండమాన్ దీవులకు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో శ్రీకాకుళం జిల్లా భారీగా నష్టపోయింది. దాదాపు లక్షకు పైగా ఎకరాల్లో వరి, మొక్కజొన్న, ఉల్లి పంటలు నీట మునిగాయి. జిల్లావ్యాప్తంగా 167 ఇళ్లు దెబ్బతిన్నాయి. లావేరు మండలం పెద్దరొంపివలసలో తమ్మినాయుడు చెరువుకు గండి పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మందస మండలంలో సునముది గెడ్డకు గండి పడడంతో లోతట్టుప్రాంతాలు నీట మునిగిపోయాయి. మత్స్యకారులు వేటకు దూరంగా ఉన్నారు. వంశధార, నాగావళి నదుల్లో క్రమేపీ నీటి ప్రవాహం పెరుగుతోంది. పూర్తిగా నిండిన పలు చెరువులకు గండ్లు పడే అవకాశం ఉడడంతో అనేక గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచిఉంది.

విజయనగరం జిల్లాలో సోమవారం ఉదయం 8 గంటల వరకు 5.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 35 వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. కేవలం వరి ద్వారానే కనీసం రూ.87.5 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. జిల్లాలోని వెంగళరాయసాగర్‌, పెద్దపల్లి, తాటిపూడి, ఆండ్ర, తోటపల్లి జలాశయాలన్నీ పూర్తి సామర్థ్యానికి చేరుకోవడంతో గేట్లు ఎత్తి నీటిని బయటకు విడిచిపెడుతున్నారు. చిన్న నీటి వనరులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. 31 చెరువులకు గండ్లు పడ్డాయి. 349 ఇళ్లు కూలిపోయాయి.

విశాఖపట్నం జిల్లాలో వర్షానికి నలుగురు మృత్యువాత పడ్డారు. 15,453 హెక్టార్లలో పంటలు నీటమునిగాయి. ఇందులో వరి 13,200 హెక్టార్లు. చెరకు, పొగాకు, అపరాలు, కూరగాయల పంటలకు గట్టి దెబ్బ తగిలింది. 804 ఇళ్లు దెబ్బతిన్నాయి. అనకాపల్లి, అచ్యుతాపురం, ఎస్‌.రాయవరం, రాంబిల్లి, నక్కపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. వరహా, శారదా నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరాహ నదికి గండిపడడంతో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏటికొప్పాక పులపర్తి కాలువలోకి జారిపడిన గొంతుమూర్తి బాపూజీ(27) అనే రైతు మృతి చెందగా, మునగపాకలో మిద్దెకూలి నంబారి మాలెమ్మ అనే వృద్ధురాలు దుర్మరణం పాలైంది. పాయకరావుపేట మండలం సత్యవరంలో గోడకూలడంతో చుక్కల మాణిక్యం (65) మృతి చెందింది. నక్కపల్లి మండలం గొడిచెర్లలో తెరపల్లి నారాయణ(70) వరదనీటిలో కొట్టుకుపోయి మరణించాడు. విశాఖ ఉక్కు కర్మాగారంతోపాటు నగర ప్రజల దాహర్తిని తీర్చే ఏలేరు కాలువకు చినగొలుగొండపేట సమీపంలో గండి పడి నీరంతా నదిలోకి ప్రవహిస్తోంది.

తూర్పు గోదావరి జిల్లాలో నలుగురి మృతి. జిల్లాలో శనివారం నుంచి సోమవారం రాత్రి వరకూ కురిసిన వర్షాలకు సుమారు 1,74,000 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వాగులు దాటే ప్రయత్నంలో జిల్లాలో ఆరుగురు గల్లంతు కాగా, గోడలు కూలటం తదితర ప్రమాదాల్లో నలుగురు మరణించారు. మొత్తం 40 మండలాల్లో వర్షాల ప్రభావం ఉంది. సామర్లకోట ప్రధాన కాలువ, తుల్యభాగ, పుష్కర, ఏలేరు కాలువలకు గండి పడటంతో పలు ప్రాంతాలు, పంట పొలాలు ముంపుకు గురయ్యాయి. జిల్లావ్యాప్తంగా 22,248 ఇళ్లు నీట మునగ్గా, 1,500 ఇళ్లు ధ్వంసమయ్యాయి. జిల్లాలోని కిర్లంపూడిలో అత్యధికంగా 35.94 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలకు 49 వేల హెక్టార్లలో వరి పంట నష్టపోయినట్లు ఈ జిల్లా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆలుగులగూడెం గ్రామానికి చెందిన వేముల యేసమ్మ(26) దెందులూరు సమీపంలోని ఏటివాగు దాటుతుండగా కాలు జారిపడి మృతిచెందింది. జిల్లాలో అనేక కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. సోమవారం 65.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో 300 వరకూ ఇళ్లు అధిక వర్షానికి పాక్షికంగా నష్టపోయాయి. వర్షాలకు కృష్ణా జిల్లాలో మొత్తం లక్ష ఎకరాల్లో వరి పంట నీట మునగగా... వేలాది ఎకరాల్లో పత్తి, వేరుసెనగ పంటకు నష్టం వాటిల్లింది. సోమవారం కూడా భారీగా వర్షం కురియడంతో అనేక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. ముంపు ప్రాంతాల వారికోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి సహాయం అందిస్తున్నారు. అవనిగడ్డ సబ్‌జైల్లోకి నీళ్లు రావడంతో ఇక్కడి 29 ఖైదీల్లో 11 మందిని నూజివీడు సబ్‌జైలుకి, మిగతావారిని విజయవాడ జిల్లా జైలుకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాల కారణంగా రొయ్యల పెంపకందారులకు భారీ నష్టం వాటిల్లింది.

మూడు రోజుల వర్షాలకు గుంటూరు జిల్లాలో రైతులు మిశ్రమ పరిస్థితులను ఎదుర్కొన్నారు. తెనాలి డివిజన్‌లో 1.5 లక్షల ఎకరాల్లో కంకిదశలో ఉన్న వరి నేలకొరిగింది. కృష్ణా తీరంలోని లంక గ్రామాల్లో నానుడు వానలకు అరటిచెట్లు నేలకొరుగుతున్నాయి. పోతార్లంక, తిప్పలకట్ట, చిలుమూరు మరికొన్ని గ్రామాల పరిధిలో తమలపాకు తోటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పసుపు, కంద, పత్తి తదితర పంటలు కూడా జిల్లాలోని పలుచోట్ల దెబ్బతిన్నాయి. వర్షాలకు ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రామాయపట్నంలోని రెడ్డిపాలెంలో ఆదివారం రాత్రి గోడ కూలి పెల్లేటి అక్కయ్య(60) అనే వ్యక్తి మరణించాడు. గుడ్లూరు సమీపంలోని ఉప్పుటేరులో పడి కె.లక్ష్మయ్య(60) అనే యాచకుడు మృతిచెందాడు. జిల్లాలో ఇప్పటికే సాగుచేసిన పొగాకు తోటలు నీరు నిలిచి కుళ్లిపోతున్నాయి. పర్చూరు, మార్టూరు, ఇంకొల్లు ప్రాంతాల్లో సాగుచేసిన మినుము పంటకు నష్టం వాటిల్లింది. కొత్తపట్నం మండలంలో సుమారు 500 ఎకరాల్లోని చేమ పంటకు వర్షం ముప్పు తెచ్చింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో సోమవారం రెండు గంటలపాటు భారీ వర్షం కురిసింది. కావలి తీరంలోని బకింగ్‌హాం కెనాల్‌కు రెండు చోట్ల గండిపడింది. చిన్నరాముడుపాళెం తీరంలో తెప్ప బోల్తాపడి మత్స్యకారుడు మృతి చెందాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X