తూర్పు ఢిల్లీలో భవనం కూలి 42 మంది దుర్మరణం

పదుల సంఖ్యలో క్షతగాత్రులు, మృతులు ఇంకా శిథిలాల్లో ఉండొచ్చని ఢిల్లీ ఆర్థిక మంత్రి ఎ.కె.వాలియా తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇటీవల యమునానది పొంగి లక్ష్మీనగర్‌లోని లలితాపార్క్ ప్రాంతమంతా నీళ్లు వచ్చాయని, పాత భవనం కావడంతో పునాదుల్లో నీరుచేరి కూలిపోయిందని వివరించారు. భవనం బేస్‌మెంట్ వద్ద ఇంకా నీరుందని స్థానికులు తెలిపారు. కూలిన భవనంపై అయిదో అంతస్తు నిర్మాణంలో ఉందని తెలిపారు. క్షతగాత్రుల్లో ఎక్కువమంది కూలీలే. ఢిల్లీ ప్రభుత్వం ఈ సంఘటనపై మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించింది. భవనం స్థానిక సిమెంట్ డీలర్‌కు చెందినది. పక్కనున్న భవనం కూడా కూలిపోయే దశలో ఉండటంతో అందులోని వారందర్నీ ఖాళీ చేయించారు. సంఘటన తీవ్రమైనదని, ఢిల్లీలో ఇటీవలికాలంలో ఇంతటి సంఘటన జరిగినట్లు గుర్తులేదని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అన్నారు.
భవనం కూలిన చోట భీతావహ వాతావరణం నెలకొంది. భారీ కాంక్రీటు శ్లాబులు, శకలాలతో ఆ ప్రదేశం నిండి పోయింది. రక్షణ చర్యల కోసం అగ్నిమాపక సిబ్బంది, పోలీసు, మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. శిథిలాల కింద చిక్కుకు పోయిన వారిని రక్షించేందుకు సిమెంటు దిమ్మెలను చేతులతోనే తొలగించేందుకు జనం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్ సరఫరా ఆగిపోయిందని, సహాయ చర్యల కోసం క్రేన్లను రంగంలోకి దించలేదని స్థానికులు ఆరోపించారు.












Click it and Unblock the Notifications