తెరాస శాసనసభ్యుల ఆందోళన : సాగని అసెంబ్లీ వాయిదా

సభను వాయిదా వేసిన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు తెలంగాణ ప్రాంత మంత్రులు, శాసనసభ్యులతో చర్చించారు. విద్యార్థులపై కేసుల ఎత్తివేత అంశంపై ఆయన నేతలతో చర్చించారు. విద్యార్థులపై ఉన్న అన్ని కేసులను ఎత్తివేయాలని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కోరారు. ప్రతి కేసునూ ప్రత్యేకంగా పరిశీలించాల్సి ఉంటుందన్న సీఎం దీనిపై అసెంబ్లీలో ప్రకటన చేస్తామని వెల్లడించారు. కేసుల ఎత్తివేతపై ప్రభుత్వం సానుకూలంగా ప్రతిస్పందించిందని, ప్రభుత్వం ప్రకటన చేస్తుందని తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు మీడియాతో చెప్పారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా తెరాస శాసనసభ్యులు తమ పట్టు వీడలేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను అర గంట పాటు వాయిదా వేశారు.
కాగా, ప్రభుత్వం విద్యార్థులను బందిపోట్లుగా చిత్రీకరిస్తూ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని తెలుగుదేశం శాసనసభ్యుడు నాగం జనార్థన్‌రెడ్డి అన్నారు. విద్యార్థులపై తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసుల తీవ్రతను పట్టించుకోకుండా అన్ని కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేసుల ఎత్తివేతపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకూ వూరుకునేది లేదని తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు సభా సమావేశాలకు ముందు అన్నారు. ఎమ్మెల్యేలకు కనీసం అసెంబ్లీలో నిరసన తెలిపే అర్హత కూడా లేదా అని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications