అర్థరాత్రి దాకా తెరాస ఎమ్మెల్యేల ఆందోళన: అరెస్టు, తరలింపు

Telangana
హైదరాబాద్‌: శాసనసభ వాయిదా పడిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు సభలోనే ఉన్నారు. విద్యార్థులపై కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ వారు శుక్రవారం శాసనసభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. సభలోనే బైఠాయించి అక్కడే భోజనాలకు, నిద్రకు ఉపక్రమించి ప్రభుత్వంపై ఒత్తిడికి తేవడానికి సిద్ధపడ్డారు. రాత్రి 10.30 గంటల సమయంలో పోలీసులు ఆందోళన చేస్తున్న తెరాస ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయానికి తరలించారు. అనంతరం అర్ధరాత్రి వారంతా హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి ఇంటి వద్దకు వెళ్లి ధర్నా చేపట్టడంతో ఆమె చర్చలకు ఆహ్వానించారు. అయితే అవి విఫలమవడంతో నేతలు అర్ధరాత్రి వరకు అక్కడే బైఠాయించారు. దీంతో వారిని పోలీసులు అరెస్టుచేసి అక్కడినుంచి గోల్కొండ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనంటూ తెరాస అధినేత కేసీఆర్‌ ధ్వజమెత్తారు. శాసనసభలో కూడా ఎమ్మెల్యేలకు నిరసన తెలిపే అధికారం లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. సభలో నిరసన తెలుపుతున్న తమ పార్టీ శాసనసభ్యులను అక్కడినుంచి బలవంతంగా తరలించడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

సభ వాయిదా పడిన తర్వాత కూడా తెరాస ఎమ్మెల్యేలు బయటకు రాలేదు. స్పీకర్‌ పోడియం వద్దే బైఠాయించారు. ముఖ్యమంత్రి, హోంమంత్రులు విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరిస్తున్నట్లు స్పష్టమైన ప్రకటన చేసే వరకు తాము సభ నుంచి బయటకు వచ్చే ప్రసక్తేలేదని భీష్మించుకొని కూర్చున్నారు. సభలోనే ఉంటామని, ఎన్నిరోజులైనా కదలబోమని ప్రకటించారు. తెరాస ఎమ్మెల్యేలకు భాజపా తన సంఘీభావం ప్రకటించింది. పార్టీ నిజామాబాద్‌ ఎమ్మెల్యే యెండెల లక్ష్మీనారాయణ కూడా తెరాస ఎమ్మెల్యేలతోపాటు శాసనసభలోనే ఉన్నారు. శాసనసభ నుంచి బయటకు రావాలని, కేసులకు సంబంధించి సభలో చర్చించేందుకు, సంబంధిత మంత్రితో ప్రకటన చేయిస్తామని చీఫ్‌విప్‌ మల్లుభట్టి విక్రమార్క తెరాస, భాజపా ఎమ్మెల్యేలతో చెప్పారు. కానీ, ముఖ్యమంత్రి లేదా హోంమంత్రి స్పష్టమైన ప్రకటన చేస్తేనే తాము సభ నుంచి బయటకు వస్తామని ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. శాసనసభ కార్యదర్శి సదారాం స్పీకర్‌ తరఫున ప్రతినిధిగా పలుమార్లు ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి సంప్రదింపులు జరిపారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వచ్చి మాట్లాడతారని, సభలో ఈ అంశంపై చర్చించేందుకు శనివారం అవకాశం ఇస్తారని చెప్పగా విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తేనే తాము ఆందోళన విరమిస్తామని తేల్చిచెప్పారు. మంత్రి శ్రీధర్‌బాబు కూడా తెరాస శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌, టి.హరీశ్‌రావులతో ఫోన్ ‌లో మాట్లాడారు. అయినప్పటికీ వారు సభలోపలి నుంచి బయటకు రాబోమని చెప్పారు.

ఎమ్మెల్యేలు సభలోనే భోజనాలు చేశారు. కొందరికి మధుమేహం ఉండడంతో మందులను కూడా సభకే తెప్పించుకున్నారు. రాత్రి పడుకోవడానికి కూడా దుప్పట్లు తెప్పించుకున్నారు. రాత్రి వరకు సభలోనే ఉన్నారు. సభ లోపల ఉన్నవారిని పరామర్శించేందుకు ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణరావు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారిలు వచ్చారు. అయితే, వీరిని లోపలికి అనుమతించకపోవడంతో ఎమ్మెల్యేలు లోపలికి వెళ్లే దారిలో నేలపైనే వీరు పడుకున్నారు. మరోవైపు తెరాస నాయకులు డాక్టర్‌ శ్రవణ్‌, గజ్జెల నగేశ్‌, కపిల్‌ తదితరుల ఆధ్వర్యంలో కార్యకర్తలు తెరాస ఎమ్మెల్యేల దీక్షకు మద్దతుగా గన్‌పార్కు వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. రాత్రి పదిన్నరకు గేట్‌-1 నుంచి డీసీపీలు అకున్‌సబర్వాల్‌, కమలాహాసన్‌రెడ్డిల నేతృత్వంలోని పోలీసుల బృందం ఎమ్మెల్యేలతో చర్చించారు. అయినా, ఎమ్మెల్యేలు పట్టువీడకపోవడంతో సభలోకి మార్షల్స్‌ వెళ్లి బలవంతంగా ఎమ్మెల్యేలను సభ నుంచి బయటకు తీసుకొచ్చారు. వెంటనే వారిని పోలీసులు అక్కడి నుంచి తెలంగాణభవన్‌కు తరలించి తెరాస ఎమ్మెల్యేలు 10మందిని, భాజపా కార్యాలయం వద్ద ఆపార్టీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణను వదిలిపెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+