పరిటాల శ్రీరాములు నుంచి మద్దెలచెర్వు సూరి దాకా

Anantapur
హైదరాబాద్: పరిటాల రవి తండ్రి పరిటాల శ్రీరాములు హత్యతో 35 ఏళ్ల కిందట మొదలైన ఫ్యాక్షన్‌ హత్యాకాండ సోమవారం సూరి హత్యతో రెండు వర్గాల్లోని రెండు తరాలను అంతం చేసింది. గంగుల నారాయణరెడ్డి, శ్రీరాములు కుటుంబాల్లోని రెండు తరాలవారు ఒక్కరూ మిగల్లేదు. అంతా ఫ్యాక్షన్‌, ప్రతిగా సాగిన నక్సల్స్‌ దాడుల్లో చనిపోయారు. నారాయణరెడ్డి ఒక కుమారుడు వెంకటేశ్వరరెడ్డి మాత్రం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.

1972-73: వామపక్ష అతివాద భావాలు కలిగిన పరిటాల శ్రీరాములు తన భూములను పంచిపెట్టి, పెనుగొండ నియోజకవర్గంలోని భూస్వాముల మిగులు భూములను పంచాలని ఉద్యమించారు. నిరుపేదలతో కలిసి భూ ఆక్రమణలకు దిగారు. ఈ క్రమంలో స్థానిక నాయకులు గంగుల(మద్దెలచెరువు) నారాయణరెడ్డి, అతని మిత్రుడు సానె చెన్నారెడ్డిలతో శ్రీరాములుకు గొడవలు వచ్చాయి.

1975: బస్సులో వివాహానికి వెళుతున్న పరిటాల శ్రీరాములు, పరిటాల సుబ్బయ్య, లింగన్న, రామాంజినేయులు తదితరులను తిరుమణి వద్ద మూకుమ్మడిగా నరికి చంపారు. దాంతో శ్రీరాములు చిన్న కుమారుడు పరిటాల హరి పీపుల్స్‌వార్‌ ఉద్యమంలో చేరాడు.

1984: అనంతపురంలో నారాయణరెడ్డిని నక్సల్స్‌ హత్య చేశారు. దీనికి సూత్రధారిగా భావిస్తున్న పరిటాల హరిని పోలీసులు ఎన్‌కౌంటర్లో చంపారు. హరిని పట్టుకొని పోలీస్‌స్టేషన్లోనే చంపారని, దీనివెనుక నారాయణరెడ్డి వర్గం పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో శ్రీరాములు పెద్ద కుమారుడు పరిటాల రవి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

1984-89: ధర్మవరం, పెనుగొండ నియోజకవర్గాల్లో పరిటాల-మద్దెల చెరువు వర్గాల మధ్య పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. గంగుల నారాయణరెడ్డి హత్య నాటికి పెద్ద కుమారుడు సూర్యనారాయణరెడ్డి(మద్దెలచెరువు సూరి) తొమ్మిదో తరగతి చదువుతున్నారు. చదువు మానేసి వర్గ కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యారు.

1989: ఎస్‌.చెన్నారెడ్డి పెనుగొండ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చెన్నారెడ్డి తనుయుడు ఓబుల్‌రెడ్డి చేశాడంటున్న అరాచకాల గురించి ధర్మవరం ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారు. అజ్ఞాతంలో పరిటాల రవి...అణచివేతకు గురయిన వర్గాలను ఏకం చేశారు.

1991: ఎమ్మెల్యే చెన్నారెడ్డిని పోలీసు దుస్తుల్లో వచ్చిన నక్సల్స్‌ కాల్చిచంపారు. శ్రీరాములు హత్యకు ప్రతీకారంగానే చంపామని పీపుల్స్‌వార్‌ ప్రకటించింది. ఉప ఎన్నికల్లో చెన్నారెడ్డి పెద్ద కుమారుడు రమణారెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలుగుదేశానికి అభ్యర్థే కరవయ్యాడు. తర్వాత కాలంలో అజ్ఞాతంలో ఉన్న రవిని ఎన్‌టీఆర్‌ ప్రోత్సహించి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు.

1993: సూరిని చంపేందుకు ఆయన ఇంట్లో ఆర్వోసీ నక్సల్స్‌ టీవీ బాంబుపేల్చారు. తల్లి సాకమ్మ, సోదరి పద్మావతి, తమ్ముడు రఘునాథరెడ్డి, మరో ఇద్దరు అనుచరులు మృతి చెందారు. సూరి ఇంట్లో లేకపోవడంవల్ల ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై చూపులన్నీ రవి వైపే వెళ్లాయి. ఈ ఘటనతో సూరి అజ్ఞాతంలోకి వెళ్లాడు.

1994: రవికి తెదేపా పెనుకొండ అసెంబ్లీ టికెట్‌ ఇచ్చింది. ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రి పదవిని చేజిక్కించుకున్నారు.

1996: తెలుగుదేశం చీలికవర్గంలో ఉన్నరవి శాసనసభకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికయ్యారు. రమణారెడ్డి ఓడిపోయారు.

1996-97: చెన్నారెడ్డి తనయులు ఓబుల్‌ రెడ్డి, రమణారెడ్డిలు వరుసగా హత్యకు గురయ్యారు. మరోపక్క మద్దెలచెరువు గ్రామంలో సూరి అనుచరులు ఒక్కొక్కరే హత్యకు గురవుతున్నారు.

1997: నవంబరు 19న జూబ్లీహిల్స్‌లో శ్రీరాములయ్య సినిమా షూటింగ్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన రవిని చంపేందుకు సూరి వర్గం కారుబాంబును ప్రయత్నించింది. ఈ ఘటనలో 26 మంది మరణించారు. రవి స్వల్పగాయాలతో తప్పించుకున్నారు. ఈ కేసులో అరెస్టయిన సూరికి యావజ్జీవ కారాగారం పడింది.

2004: సూరి భార్య భానుమతి పెనుగొండలో కాంగ్రెస్‌ తరఫున పరిటాల రవి మీద పోటీచేసి ఓడిపోయారు. రవిగెలిచినా పార్టీఓడిపోవడంతో ఆయన రక్షణ ప్రమాదంలోపడింది. కొత్త ప్రభుత్వంలో పరిటాల అనుచరులు ఒక్కొక్కరే హత్యకు గురవుతున్నారు. రవికి రక్షణ తగ్గించారు. దీనిపై తెదేపా ఉద్యమిస్తున్న తరుణంలోనే రవి హత్య జరిగింది.

2005: జనవరి 24న అనంతపురం తెదేపా కార్యాలయంలో పట్టపగలు రవిని... సూరి అనుచరుడు మొద్దు శీను బృందం అతిదగ్గర నుంచి కాల్చి చంపింది.

2006: రవి హత్య జరిగినప్పటి నుంచి ఢిల్లీలో మకాం వేసిన మొద్దుశీను హైదరాబాద్‌లో సెటిల్‌మెంట్‌ చేయడానికి వచ్చి నాటుబాంబు పేలిన ఘటనలో గాయపడి పోలీసులకు దొరికిపోయాడు.

2008: నవంబరు 9న మొద్దుశీను అనంతపురం జైల్లో హత్యకు గురయ్యాడు. ఓంప్రకాశ్‌ అనే అంతర్రాష్ట్ర ఖైదీ సిమెంట్‌తో చేసిన డంబెల్‌తో నిద్ర పోతున్న శీను తలపై మోది చంపాడు. ఇది సూరి చేయించిన హత్యేనని శీను తల్లి ఆరోపించారు.

2009: డిసెంబరు 25న సూరి బెయిలుపై బయటికి వచ్చారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బెయిలు ఇచ్చిన హైకోర్టు సూచించింది. అయితే, సూరి జైల్లో ఉంటూనే సెటిల్‌మెంట్లు మొదలు పెట్టాడు. విడుదల అయ్యాక జోరందుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+