న్యూఢిల్లీ : మావోయిస్టు నేత ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీం కోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. గణతంత్ర రాజ్యంలో మన పిల్లల్ని మనమే చంపడాన్ని అనుమతించమని కోర్టు వ్యాఖ్యానిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసులో న్యాయవిచారణకు కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్, ఈ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ప్రముఖ జర్నలిస్టు హేమచంద్రపాండే భార్య బబితా పాండే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఈ కేసును లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది. గత సంవత్సరం జులై మొదటి వారంలో ఆదిలాబాద్ జిల్లా, మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నేత ఆజాద్‌తో పాటు ప్రముఖ జర్నలిస్టు హేమచంద్రపాండే మృతిచెందారు.