కిరణ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తాను పార్టీ అధిష్టానంపై విమర్శలు చేయడం లేదని, ముఖ్యమంత్రిని మాత్రమే వ్యతిరేకిస్తున్నానని, అలాంటప్పుడు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తనపై సిఫార్సు చేయాలని ఆయన అన్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. రచ్చబండలో పాల్గొనని శాసనసభ్యులపై చర్యలు తీసుకుంటామని చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క అనడాన్ని ఆయన తప్పు పట్టారు. గతంలో ప్రస్తుత తెలుదేశం సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెసు టికెట్‌పై గెలిచి ప్రభుత్వాన్ని విమర్శించారని, దాంతో మోత్కుపల్లి నర్సింహులును సస్పెండ్ చేశారని, ఇప్పుడు కూడా అలాగే సస్పెండ్ చేయాలని ఆయన అన్నారు.
శాసనసభ్యులు నియోజకవర్గాల్లో తిరగడం లేదని భావించి గతంలో రచ్చబండ, ప్రజాపథం వంటి కార్యక్రమాలు చేపట్టారని, తాను నెలలో ఇరవై రోజులు నియోజకవర్గంలో తిరుగుతున్నానని, తన లాంటివారికి రచ్చబండ అవసరం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఐదేళ్లలో రెండు, మూడు సార్లు మాత్రమే తన నియోజకవర్గంలో తిరుగుతారని, ముందు కిరణ్ కుమార్ రెడ్డి ఆయన నియోజకవర్గంలో తిరగాలని రామచంద్రారెడ్డి అన్నారు. రచ్చబండ కార్యక్రమం తెలంగాణలో జరిగే పరిస్థితి లేదని, ఇటువంటి స్థితిలో రచ్చబండ కార్యక్రమం చేపట్టడం ప్రభుత్వానికి ముప్పు తెచ్చుకోవడమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications