బెల్లంతో కొబ్బరి లడ్డు.. రుచికే కాదు మంచి పోషకం కూడా!
కొబ్బరి తో తయారు చేసిన స్వీట్స్ ఏవైనా సరే చాలా బాగుంటాయి. ఇప్పటివరకు మనం కొబ్బరి లవుజు ఎలా తయారుచెయ్యాలో తెలుసుకున్నాం. ప్రస్తుతం మనం నోరూరించే, ఆరోగ్యకరమైన, సాంప్రదాయకమైన వంటకం బెల్లంతో కొబ్బరి లడ్డులు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. పండుగలకైనా, ఇంటికి వచ్చిన అతిథులకు పెట్టడానికైనా ఈ కొబ్బరి లడ్డులు చాలా రుచికరంగా ఉంటాయి.
తయారీకి కావలసిన పదార్థాలు
పచ్చి కొబ్బరి తురుము: రెండు కప్పులు
బెల్లం తురుము: 1 1/4 కప్పు
యాలకుల పొడి: అర టీ స్పూన్
నెయ్యి: రెండు టేబుల్ స్పూన్ లు
జీడిపప్పు: 20
నీళ్లు : పావు కప్పు

తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో జీడిపప్పు ముక్కలను వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో తురిమిన బెల్లాన్ని ఒక పావు కప్పు నీళ్లు పోసి బెల్లం పూర్తిగా కరిగి బుడగలు రావడం ప్రారంభం అయ్యేవరకు ఉడికించాలి. అయితే ఇక్కడ తీగపాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగి కాస్త జిగురుగా ఉంటే సరిపోతుంది.
ఇలా చేస్తే కొబ్బరి లడ్డులు బాగుంటాయి
ఆ తర్వాత అందులో పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి మిశ్రమం దగ్గర పడేవరకు గరిటతో తిప్పుతూనే ఉండాలి. కొబ్బరి, బెల్లం కలిసిపోయి పాన్ కు అంటుకోకుండా ముద్దలా తయారవుతుంది. మిశ్రమం చిక్కబడిన తర్వాత అందులో యాలుకల పొడి, మిగిలిన ఒక స్పూన్ నెయ్యి మరియు వేయించిన జీడిపప్పు ముక్కలు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యండి.
చేతులకు నెయ్యి రాసి చిన్న, చిన్న లడ్డూలు చుట్టుకుంటే బెస్ట్
ఈ మిశ్రమం చల్లారాక చేతితో లడ్డులు చుట్టుకోవటమే. అయితే చేతులకు నెయ్యి రాసి చిన్న, చిన్న లడ్డూలు చుట్టుకుంటే బాగుంటాయి. ఈ లడ్డూలు గాలి చొరబడని డబ్బాలో ఉంచితే వారం నుండి పది రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. ఫ్రిజ్ లో పెట్టుకుంటే మరో పదిరోజులు ఎక్కువ నిల్వ ఉంటాయి.












Click it and Unblock the Notifications