Big Shock: డేంజర్ లో 13 కోట్ల మంది భారతీయులు.. సంచలన రిపోర్టు బయటకు
ప్రస్తుతం వాతావరణ మార్పు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలకు దారి తీస్తోంది. వాతావరణ మార్పు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి జీవితాలు అస్తవ్యస్తంగా మారాయి. అయితే వాతావరణ మార్పునకు సంబంధించి క్లైమేట్ సెంట్రల్ అనే సంస్థ తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాతావరణ మార్పుల కారణంగా పగటిపూట ఉష్ణోగ్రతలు మాత్రమే కాదు రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి. దాని కారణంగా రాత్రిళ్లు నిద్ర కరువై దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. రాత్రిళ్లు అధిక ఉష్ణోగ్రతల ప్రభావం దాదాపు 13 కోట్ల మందిపై పడనున్నట్లు తెలిపింది.
2020 నుంచి 2025 మధ్య దేశంలోని దాదాపు 1300 లకు పైగా నగరాల్లో ఈ పరిశోధన జరిపింది. దేశంలోని అనేక నగరాల్లోని ప్రజలు రాత్రిళ్లు అధిక ఉష్ణోగ్రతల కారణంగా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని తేలింది. భారత్ లోని నగరాల్లో చెన్నై ఫస్ట్ స్థానంలో ఉంది. చెన్నైలో రాత్రిళ్లు అధిక ఉష్ణోగ్రత కారణంగా అక్కడి ప్రజలు సంవత్సరంలో యావరేజ్ గా 93 గంటల నిద్రను కోల్పోతున్నట్లు నివేదికలో స్పష్టమైంది. చెన్నై తర్వాతి స్థానంలో ముంబై ఉంది. ముంబైలోని ప్రజలు ఏడాదిలో దాదాపు 84 గంటల నిద్రను కోల్పోయారు.
ఇక మూడోస్థానంలో కోల్ కతా ఉంది. కోల్ కతాలో ఏడాది కాలానికి అక్కడి ప్రజలు దాదాపు 80 గంటల నిద్రను కోల్పోయినట్లు నివేదికలో తేలింది. ఆ తర్వాత స్థానాల్లో హైదరాబాద్, బెంగళూరు ఉన్నాయి. వాతావరణ మార్పులు ఈ రెండు నగరాల్లో గణనీయంగా పెరిగాయని అందువల్ల ఏటా దాదాపు 8 గంటలు అదనంగా అక్కడి ప్రజలు నిద్రను కోల్పోతున్నారని తేల్చింది. ఈ మేరకు వేడి రాత్రులు దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో సవాల్ గా మారిందని వివరించింది.
సాధారణంగా మానవ శరీరంలో నిద్రకు ముందు అలాగే నిద్రలో ఉన్నప్పుడు ఉష్ణోగ్రత తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే రాత్రి వేళల్లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా మానవ శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గడంలో సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంది. అందువల్ల రాత్రిళ్లు నిద్రలేమి, నాణ్యమైన నిద్ర లేకపోవడం, నిద్రలోంచి తరచుగా లేచి కూర్చోవడం జరుగుతున్నాయని వివరించారు.

అలాగే నగరాల్లోని కాంక్రీట్ బిల్డింగ్, పచ్చదనం లేకపోవడం, పట్టణీకరణ పెరిగిపోవడం.. తదితర కారణాలతో ఉష్ణోగ్రతలు మరింత తీవ్రతరం అవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి కారణంగా ప్రజలు గుండె జబ్బులు, డయాబెటిస్, ఊబకాయం తదితర ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. చెట్లను పెంచడం, అర్బన్ ప్లానింగ్ లో కీలక మార్పులు, వాతావరణ పరంగా చర్యలు తీసుకోవడం, పచ్చదనాన్ని పెంచడం.. తదితర కారణాలతో అర్బన్ నగరాల్లో అధిక ఉష్ణోగ్రతలను తగ్గించవచ్చని సూచిస్తున్నారు.














Click it and Unblock the Notifications