తెలంగాణపై ఢిల్లీ వెళ్లి తేల్చుకోండి: కెసిఆర్‌కు డిఎస్ హితవు

తెలంగాణ కోసం అంటూ ఇక్కడ ఉద్యమాలు చేస్తే సరిపోదన్నారు. కేంద్రం స్థాయిలో ఒత్తిడి తీసుకు రావాలన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు వెళ్లినట్టు అందరూ ఢిల్లీ వెళ్లి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌లపై ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు మహాత్మాగాంధీ పద్ధతిలో పోరాడుతామని చెప్పారన్నారు. అయితే ఇప్పుడు అసెంబ్లీ ఘటన ఆయనకు గాంధేయవాదంలా కనిపిస్తుందా అని ప్రశ్నించారు. సహాయ నిరాకరణతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. సహాయ నిరాకరణను కూడా రాజకీయం చేశారని ఆక్షేపించారు. సహాయ నిరాకరణల పేరుతో సర్కారు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కల్పించ వద్దని డిఎస్ ఉద్యోగులను కోరారు.
ఎన్నికలకు ఇంకా మూడేళ్లు గడువు ఉందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు లేనందున సర్వే నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏమాత్రం లేదన్నారు. కొందరిని రాజకీయంగా ప్రమోట్ చేయడానికే సర్వేలు చేస్తున్నారన్నారు. సర్వేలకు ఇది సమయం కూడా కాదన్నారు.