పవన్ నిశిత పరిశీలన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తోంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని చంద్రబాబు.. ఈ ఉదయం విశాఖపట్నంలో భారీ సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. 10 కిలోమీటర్ల మేర స్వయంగా సైకిల్ తొక్కారు. మొక్కలను నాటారు.
పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ ఫ్లై పార్క్ లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలసి స్వయంగా సీడ్ బాల్స్ తయారు చేశారు. అంకుడు, తెల్లపొణికి, వేప, కుంకుడు, రావి, మర్రి, వెదురు, ఉసిరి, చింత, మోదుగ తదితర స్వదేశీ జాతి విత్తనాలతో ఈ సీడ్ బాల్స్ తయారు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 ప్రాంతాల్లో విస్తృతంగా సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మూలపాడు బటర్ ఫ్లై పార్క్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్నిపవన్ కళ్యాణ్ వీక్షించారు. సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న ప్రజలతో ముచ్చటించారు. ఏఏ విత్తనాలతో సీడ్ బాల్స్ తయారు చేస్తున్నారు? ఎంత మొత్తంలో రూపొందిస్తున్నారు? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
వన సంరక్షణకు పని చేస్తున్న మహనీయుల స్ఫూర్తితో విత్తన బంతుల తయారీ ప్రక్రియను బాధ్యతగా ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. సీడ్ బాల్స్ అవసరాన్ని వివరించిన చిన్నారులను అభినందించారు. జూన్ 15వ తేదీ నాటికి 2.5 కోట్ల సీడ్ బాల్స్ రూపొందించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. అనంతరం డ్రోన్ల సహాయంతో కొండ శిఖరాలపై విత్తన బంతులు జారవిడిచే ప్రక్రియను పరిశీలించారు.
అంతకు ముందు మూలపాడు బటర్ ఫ్లై పార్కులో అటవీ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన సందర్శించారు. బటర్ ఫ్లై పార్కు నమూనా పరిశీలనలో అక్కడ యోగా హాల్ నిర్మాణం ఆయనను ఆకట్టుకుంది. ప్రతి ఎకో టూరిజం పార్కులో ఒక యోగా హాల్ నిర్మించే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కొండపల్లి కొయ్య బొమ్మలు తయారీకి వినియోగించే తెల్ల పొణికి దుంగలను పరిశీలించారు.
అక్కడే ఏర్పాటు చేసిన కొండపల్లి కొయ్య బొమ్మలు, ఉదయగిరి కళాకారులు నిర్ధ, బిళ్ల నిర్ధ, వేప కర్రతో తయారు చేసిన గ్లాసులు, గరిటలు వంటి వంట ఇంటి సామాగ్రిని ఆసక్తిగా తిలకించారు. కళాకారులు రూపొందించిన చెక్క వాచ్, ల్యాప్ టాప్ పవన్ కళ్యాణ్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిత్తూరు నుంచి వచ్చిన కళాకారులు బొమ్మల తయారీకి అవసరం అయిన చెక్క లభించడం లేదని తెలపగా, వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కొయ్య బొమ్మల కళాకారులు ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారి ప్రతిమను తయారు చేయించాలని కోరారు. అద్భుతమైన కళారూపాలకు మార్కెటింగ్ కల్పించేందుకు, ప్రచారం ద్వారా ప్రాచుర్యం కల్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి రెండు నెలలకి ఓ ప్రాంతంలో చేతి వృత్తుల కళాకారులను కలిసే ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.












Click it and Unblock the Notifications