శక్తిమంతమైన జ్యేష్ఠ పూర్ణిమ: శుభ ముహూర్తాలివే
హిందూ సంప్రదాయంలో జ్యేష్ఠ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ నెలలో వచ్చే పూర్ణిమను జ్యేష్ఠ పూర్ణిమగా వ్యవహరిస్తారు. ఈ రోజున పవిత్ర నదీ స్నానం ఆచరించడం, ఉపవాసం ఉండటం, శక్తి కొలది దానధర్మాలు చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. సాధారణంగా తిథుల మార్పుల వల్ల వ్రతం ఒక రోజు, స్నానదానాలు మరో రోజు వస్తుంటాయి. ఈ సంవత్సరంలో జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఈ పవిత్ర కార్యాలన్నీ ఒకే రోజున నిర్వహించుకునే అద్భుత అవకాశం లభించింది.
వైదిక పంచాంగం ప్రకారం ఈ నెల 29న సోమవారం జ్యేష్ఠ పూర్ణిమ తిథి తెల్లవారుజామున 3:06 నిమిషాలకు ప్రారంభమై, మరుసటి రోజు తెల్లవారు జామున 5:26 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రాతిపదికన సోమవారమే పూర్ణిమ వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. ఈ రోజున సూర్యోదయం, చంద్రోదయం రెండూ పూర్ణిమ తిథిలోనే సంభవించడం విశేషం. దీనివల్ల వ్రతం, స్నానం, దానం వంటి పూజా కార్యక్రమాలన్నీ ఒకే రోజున భక్తులు నిర్వహించుకోవచ్చు.

ముహూర్తాలు, శుభ యోగాలు
ఈ సంవత్సరం జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రత్యేకమైన శుభ యోగాలు రూపుదిద్దుకుంటున్నాయి. పవిత్ర స్నానానికి అత్యంత అనుకూలమైన బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:06 గంటల నుంచి 4:46 గంటల వరకు ఉంటుంది. అలాగే, శుభకార్యాలకు ఉపయుక్తమైన అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 గంటల నుంచి మధ్యాహ్నం 12:52 గంటల వరకు ఉంటుంది.
ఇక పూజల విషయానికి వస్తే అమృత ముహూర్తం ఉదయం 5:26 గంటల నుంచి 7:11 గంటల వరకు, శుభ సమయం ఉదయం 8:55 గంటల నుంచి 10:40 గంటల వరకు ఉంది. అదేవిధంగా 29 సాయంత్రం 7:16 గంటలకు చంద్రోదయం అవుతుంది. పూర్ణిమ రాత్రి వేళ చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందని నమ్ముతారు. సాయంత్రం ప్రదోష కాలంలో లక్ష్మీదేవిని పూజించడానికి 7:23 గంటల నుంచి 8:38 గంటల వరకు అనువైన సమయంగా పంచాంగం చెబుతోంది.
భద్ర కాలం ప్రశస్త్యత, వైశిష్ట్యం
ఈ రోజున భద్ర ప్రభావం ఉదయం 5:26 గంటల నుండి సాయంత్రం 4:16 గంటల వరకు ఉంటుంది. ఈ కాలంలో భద్ర నివాసం పాతాళ లోకంలో ఉండటం వల్ల పూజా కార్యక్రమాలకు, మంత్ర జపాలకు ఎలాంటి ఆటంకం ఉండదు. జ్యేష్ఠ పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం వల్ల కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ రోజు రాత్రి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పవిత్రమైన పర్వదినాల్లో జ్యేష్ఠ పూర్ణిమకు విశిష్ట స్థానం ఉంది. ఈ రోజంతా ఆధ్యాత్మిక చింతనతో గడపడం, పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభించడంతో పాటు జాతకంలో ఉన్న చంద్ర దోషాలు తొలగిపోతాయి. సంప్రదాయబద్ధంగా సరైన ముహూర్తాలను అనుసరించి పూజలు చేయడం ద్వారా భక్తులకు లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో పాటు సకల శుభాలు కలుగుతాయి.
జ్యేష్ఠ పూర్ణిమ రోజున వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కోసం వట సావిత్రి వ్రతాన్ని (వట పూర్ణిమ) ఆచరిస్తారు. ఈ రోజున మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి, రక్షా దారం కట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సంప్రదాయం ద్వారా దాంపత్య జీవితంలో అనుబంధం మరింత దృఢపడుతుందని విశ్వసిస్తారు. ఇదే శుభ దినాన ప్రసిద్ధ సమాజ సంస్కర్త సంత్ కబీర్ దాస్ జయంతి, బటుక్ భైరవ జయంతిని కూడా జరుపుకుంటారు.












Click it and Unblock the Notifications