భవిష్యత్ పరిణామాలకు మీదే బాధ్యత - హరీష్ హెచ్చరిక..!!
బీఆర్ఎస్ నేత.. మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద మోటార్లు ఆన్ చేసి.. రైతన్నకు సాగు నీరు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. రాజకీయం కోసం లక్షలాది మంది రైతుల ఉసురు పోసుకోవద్దంటూ ప్రభుత్వానికి హితవు పలికారు. నీళ్లు లేకుంటే విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఏర్పడే తీవ్ర పరిణామాలకు నీదే బాధ్యత అంటూ ముఖ్యమంత్రి రేవంత్ ని హరీష్ హెచ్చరించారు.
మాజీ మంత్రి హరీష్ సీఎం రేవంత్ లక్ష్యంగా ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ప్రతి చుక్కని పట్టిసీమ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒడిసి పడుతుందని గుర్తు చేశారు. రైతులకు నీళ్లు ఇవ్వమంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను తిడుతున్నారని కాంగ్రెస్ నేతల తీరుపై మండిపడ్డారు. గోదావరి జలాలు వచ్చినవి వచ్చినట్లు కిందకి వదులుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెడుతున్నారంటూ సీఎం రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్‌ను తిడితే నీళ్లు రావని.. మోటార్లు ఆన్ చేస్తే నీళ్లు వస్తాయని వ్యాఖ్యానించారు. భద్రాచలం కొట్టుకుపోతుందంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితమని అన్నారు.

రైతులకు నీళ్లు వదిలే వరకూ పోరాటం చేస్తాం
రైతుల కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని హరీష్ చెప్పుకొచ్చారు. తనను కావాలంటే కోయాలని.. రైతులకు మాత్రం నీళ్లు వదలాలని కోరారు. రేవంత్ నీళ్లు ఇవ్వడం ఇష్టం లేక ఆయన అలా మాట్లాడుతున్నారని చెప్పారు. భేషజాలకు పోవద్దంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. అన్ని రిజర్వాయర్లు నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 60 శాతం తెలంగాణకు సాగు నీరు ఇచ్చే అవకాశం ఉందని వివరించారు. రైతులకు నీళ్లు ఇచ్చే దాక ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. చిన్నకోడూరు మండలం అన్నపూర్ణ రిజర్వాయర్ (అల్లీపూర్) వద్ద నుంచి రంగనాయకసాగర్ వరకు రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. 16 కిలో మీటర్ల మహాపాదయాత్రలో వేలాది మంది రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు.













Click it and Unblock the Notifications