భార్యతో మాట్లాడకపోవడం నేరం కాదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడం, కొన్ని రోజుల పాటు వారి మధ్య మాటలు నిలిచిపోవడం వైవాహిక జీవితంలో సహజమని సుప్రీంకోర్టు పేర్కొంది. కేవలం కొన్ని రోజుల పాటు భార్యతో మాట్లాడకుండా ఉన్నంత మాత్రాన భర్తను ఆమె పట్ల క్రూరత్వానికి పాల్పడినట్లుగా భావించి దోషిగా తేల్చలేమని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్.చంద్‌లతో కూడిన ధర్మాసనం ఒక కేసు విచారణలో భాగంగా భర్తను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పును వెల్లడించింది. గతంలో అతనికి కింది కోర్టు, మద్రాస్ హైకోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
13 రోజులు మాట్లాడలేదని భార్య ఆత్మహత్య
ఈ కేసు వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి తన భార్యతో వరుసగా 13 రోజుల పాటు మాట్లాడలేదు. భర్త తనతో మాట్లాడకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సదరు మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై విచారణ జరిపిన కింది కోర్టు, మద్రాస్ హైకోర్టు ఐసీపీ సెక్షన్ 498ఏ కింద ఆ భర్తను దోషిగా తేల్చాయి. అతనికి మూడేళ్ల జైలు శిక్షను ఖరారు చేశాయి. దీనిని సవాలు చేస్తూ నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

నిర్దోషిగా భర్త విడుదల
ఈ అప్పీలును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. భర్తను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. "ఎటువంటి బలమైన ఆధారాలు లేకుండా, కేవలం 13 రోజుల పాటు మృతురాలితో మాట్లాడకుండా ఉండటాన్ని ఈ కేసు పరిస్థితుల ప్రకారం నేరంగా పరిగణించలేం" అని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా, అప్పీలుదారు (భర్త), మృతురాలి మధ్య కింది కోర్టులు శిక్ష విధించే స్థాయిలో ఎటువంటి పెద్ద గొడవలు జరిగినట్లు ఆధారాలు లేవని ధర్మాసనం పేర్కొంది. భర్తపై మోపిన నేరం ఆరోపణలను నిరూపించడానికి తగిన ఆధారాలు లేవనే విషయాన్ని హైకోర్టు తన తీర్పులో పరిగణనలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టు తప్పుపట్టింది.
అసలేన నేరం అంటే ఏంటో వివరించిన సుప్రీంకోర్టు
ఈ సందర్భంగా సెక్షన్ 498A కింద నేరం అంటే ఏమిటో సుప్రీంకోర్టు స్పష్టంగా వివరించింది. ఓ మహిళను ఆత్మహత్యకు ప్రేరేపించేలా, ఆమెకు శారీరక గాయాలు చేసేలా లేదా ఆమె మానసిక ఆరోగ్యానికి ముప్పు కలిగించేలా సదరు వ్యక్తి ప్రవర్తన తీవ్రంగా ఉందో లేదో నిర్ధారించుకోవడం అవసరమని కోర్టు తెలిపింది. నేరాన్ని నిరూపించాలంటే, నిందితుడు కావాలనే సదరు మహిళను వేధించే ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. ఈ సందర్భంలో ఫిర్యాదు చేయడానికి కొంతకాలం ముందు నుంచి నిరంతరం వేధింపులకు గురిచేయడం ఒక ముఖ్యమైన అంశం కావచ్చు. అంతేకానీ చిన్న చిన్న గొడవలను 498A కింద నేరంగా భావించలేమని స్పష్టం చేసింది. అందువల్ల కేసు పూర్తి పరిస్థితులను, నిందితుడి ప్రవర్తనను విశ్లేషించి, దాని ప్రభావాన్ని అంచనా వేయడం న్యాయస్థానాల విధి అని సుప్రీంకోర్టు పేర్కొంది.












Click it and Unblock the Notifications