4 కార్పోరేషన్లలో సంచలన ఫలితాలు? భారీ క్రాస్ ఓటింగ్ ? మేయర్లు, కార్పోరేటర్లపై సీప్యాక్ సర్వే..!
ఆంధ్రప్రదేశ్ లో రెండో దశ మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఈ నెల 26న రాష్ట్రంలోని నాలుగు మున్సిపల్ కార్పోరేషన్లతో పాటు 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోలింగ్ జరగబోతోంది. ఇందులో కీలకమైన నాలుగు మున్సిపల్ కార్పోరేషన్లలో ప్రస్తుతం ఓటర్ల మూడ్ ఎలా ఉంది ? ప్రతీ చోటా కూటమి, వైఎస్సార్సీపీల్లో ఎవరికి ఎడ్జ్ లభిస్తోందనే అంశాలపై సీ-ప్యాక్ (C-PAC Survey) నిర్వహించిన సర్వే ఫలితాలు వెలువడ్డాయి.
ఇందులో ముందుగా అమరావతి రాజధాని పరిధిలోకి వచ్చే మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ లో మొత్తం 62 డివిజన్లు ఉండగా.. ఇందులో 54 డివిజన్లలో టీడీపీ విజయం ఖాయమని సీ ప్యాక్ సర్వే తేల్చింది. అలాగే మేయర్ పీఠం కూడా టీడీపీ దక్కించుకుంటుందని తేలింది. శ్రీకాకుళం మున్సిపల్ కార్పోరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. వీటిలో దాదాపు 38 డివిజన్లలో కూటమి విజయం ఖాయమని సర్వే తేల్చింది. చాలా డివిజన్లలో వైసీపీ-కూటమి మధ్య ముఖాముఖీ పోటీ ఉందని వెల్లడించింది. ఇందులో కూటమి విజయం సాధిస్తుంది. అయితే మేయర్ ఎన్నికల్లో మాత్రం వైసీపీ విజయం సాధిస్తుందని సీ ప్యాక్ అంచనా వేసింది.

మరోవైపు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పోరేషన్ కు జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం 72 డివిజన్లలో కూటమి దాదాపు 54డివిజన్లలో గెలువబోతున్నట్లు సీప్యాక్ సర్వే అంచనా వేస్తోంది. రూరల్ ప్రాంతాల్లో కూటమికి అనుకూల పరిస్ధితులు ఉన్నట్లు కూడా తేల్చింది. అర్బన్ ప్రాంతాల్లో ఓటర్ల ప్రభావం అధికంగా ఉండటంతో ఇక్కడ కూడా వైసీపీ-కూటమి మధ్య ముఖాముఖీ పోరు నెలకున్నట్లు తెలిపింది. ఇందులో కూటమికి ఆధిక్యం లభించనుంది. మేయర్ ఎన్నికల్లో మాత్రం వైసీపీ విజయం సాధిస్తుందని సీప్యాక్ అంచనా వేస్తోంది.
చివరిగా కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ లో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. ఇందులో అత్యధిక డివిజన్లలో వైసీపీ విజయం సాధించే అవకాశం ఉందని సీ ప్యాక్ సర్వే వెల్లడించింది. అలాగే మేయర్ పీఠాన్ని సైతం వైసీపీ కైవసం చేసుకోబోతోందని సర్వేలో అంచనా వేశారు. ఈ లెక్కన త్వరలో రెండో దశ మున్సిపల్ ఎన్నికలు జరిగే నాలుగు కార్పోరేషన్లలో మేయర్ ఎన్నికల్లో వైసీపీ మూడు చోట్ల విజయం సాధించబోతున్నట్లు అంచనా వేసింది. కూటమికి కేవలం మంగళగిరి-తాడేపల్లి కార్పోరేషన్ మాత్రమే దక్కుతుందని తెలిపింది. డివిజన్ల లెక్కన చూస్తే కూటమి మూడు చోట్ల గెలువబోతున్నట్లు అంచనా వేసింది.














Click it and Unblock the Notifications
