జీతాలు మహా లేటు! తెలంగాణకు సహాయ నిరాకరణ, సీమాంధ్రకు ఐటి!

కానీ తెలంగాణ జిల్లాల్లో ఏ ట్రెజరీలోనూ జీతాల బిల్లులు స్వీకరించలేదు. బిల్లులు తీసుకు రావాల్సిందిగా ట్రెజరీల ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందడంతో వివిధ ప్రభుత్వ శాఖలు తమ ఉద్యోగుల బిల్లులను హడావుడిగా పంపిచారు. అయితే ట్రెజరీ కార్యాలయాల వద్ద ఉద్యోగులెవరూ లేక బిల్లులను స్వీకరించ లేదు. ఒకవేళ ఎవరైనా ఉద్యోగి ధైర్యం చేసి బిల్లులు తీసుకుందామనుకున్నా ఆందోళనకారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉండటంతో ఆ సాహసం చేయలేకపోతున్నారు. ఒకవేళ జీతాల బిల్లుల వరకు సహాయ నిరాకరణను మినహాయించిన పక్షంలో సోమవారం వీటిని స్వీకరించవచ్చు.
వీటి ఆధారంగా మంగళవారం మార్చి 1 నాటికి ట్రెజరీ అధికారులు చెక్కులు తయారు చేయగలగాలి. అలా చెక్కులు సిద్ధమైనప్పటికీ అదే రోజున ఉద్యోగుల జీతాలు అందే అవకాశం లేదు. మార్చి 2వ తేదీ మహా శివరాత్రి. ఆ రోజు సెలవు. ఇక మూడు, నాలుగు తేదీల్లో చెక్కులు రెడీ అయితే ఐదారు తేదీల తర్వాత మాత్రమే జీతాల చెల్లింపులు జరగవచ్చని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఇదంతా జరగాలంటే సోమవారం ట్రెజరీల్లో బిల్లులు స్వీకరించాలి. ఉద్యమ తీవ్రతను చూస్తే ఇది ఏమాత్రం జరిగేలా కనిపించడం లేదు. సహాయ నిరాకరణ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఈ పరిస్థితి చూస్తుంటే పదో తేదీ వరకు జీతాలు అందకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.
సీమాంధ్ర జిల్లాల్లోనూ అనేక మంది ఉద్యోగులకు జీతాలు అందని పరిస్థితి నెలకొంది. ఐటీ పరిధిలోకి వచ్చే ఉద్యోగులంతా తమ ఆదాయ పన్ను వివరాలను ఫిబ్రవరి 25లోగా అందించాలి. వారి జీత భత్యాల బిల్లులను మాత్రమే సంబంధిత ట్రెజరీ కార్యాలయాల్లో సమర్పిస్తారు. అయితే ఈసారి నిబంధనలు మారాయి. దీని ప్రకారం నెలకు రూ.3 వేలకు పైగా కిరాయి చెల్లిస్తున్న ప్రతి ఒక్కరూ అద్దె రసీదు సమర్పించాలి. ఇలా లిఖితపూర్వకంగా రసీదు ఇచ్చేందుకు యజమానులు ఇష్టపడలేదు. దీంతో ఐటీ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల్లో చాలామందికి 1న జీతాలు అందే పరిస్థితి లేదని తెలిసింది. అయితే జీతాలకు నిధుల కొరత లేదని, జీతాలకు అవసరమైన రూ.3 వేల కోట్లు ట్రెజరీలకు అందుబాటులో ఉంచామని ఆర్థిక శాఖ అంటుంది.