జగన్ సమస్య కాదు, ప్రభుత్వాన్ని కూల్చివేయడమే ఎజెండా!: ఈటెల

తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై అటా ఇటా తేల్చోకోవాలన్నారు. తెలంగాణ సాధన కోసం పదిలక్షల మందితో హైదరాబాద్‌ను దిగ్బంధం చేయాలని మార్చి 10న మిలియన్ మార్చ్‌ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. తెలంగాణ తీర్మానం అసెంబ్లీలో ప్రవేశ పెట్టే వరకు శాసనసభా సమావేశాలను జరగనిచ్చేది లేదని హెచ్చరించారు. సమైక్యాంధ్రలో అసెంబ్లీ సమావేశాలు జరగనిచ్చేది లేదన్నారు. కాంగ్రెసు శాసనసభ్యులు అటా ఇటా తేల్చుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఇస్తామని 2009 డిసెంబర్ 9న మాట ఇచ్చి ఆ తర్వాత మాట తప్పిన కాంగ్రెసు అధిష్టానం వైపు ఉంటారా, లేదా తమను ఎన్నికలలో గెలిపించి తెలంగాణ కోసం పోరాడుతున్న తెలంగాణ ప్రజల వైపు ఉంటారా అనేది కాంగ్రెసు ప్రజాప్రతినిధులు నిర్ణయించుకోవాలన్నారు. కేంద్రం వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గత డిసెంబర్ 9న కేంద్రం చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ సాధించే వరకు టిఆర్ఎస్ ఉద్యమిస్తుందన్నారు. అసెంబ్లీలో, బయట తెలంగాణ ఉద్యమ కార్యాచరణ కోసం బుధవారం సమావేశం అవుతున్నామని చెప్పారు.