కిరణ్‌కు వైయస్ జగన్ భయం, పెరుగుతున్న చంద్రబాబు ఆశలు

కాగా, కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకు వైయస్ జగన్ వర్గం నుంచి తిప్పలు తప్పేట్లు లేవని ప్రస్తుత పరిణామాలే తెలియజేస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో మంత్రి గల్లా అరుణ తప్ప మిగతా శాసనసభ్యులంతా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పనికట్టుకుని ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పనిచేసి వైయస్ జగన్ అభ్యర్థిని గెలిపించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. నెల్లూరు జిల్లాకు వైయస్ జగన్ వర్గం రాంరెడ్డి ప్రతాప రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సహా పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులు వైయస్ జగన్‌కు మద్దతుగా నిలిచారు. కాగా, కాంగ్రెసు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వర్గానికి చెందిన వాకాటి నారాయణ రెడ్డిని అభ్యర్థిగా కాంగ్రెసు ప్రకటించింది. అయితే, ఆయనకు ఆనం సోదరులు సహకరించడం కష్టమే.
ఇదిలావుంటే, పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెసు అభ్యర్థిగా ఎంపికైన గంగాభవానికి స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. మంత్రి వట్టి వసంతకుమార్ సమక్షంలోనే కాంగ్రెసు ప్రజాప్రతినిధులు గంగాభవాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. దీంతో ఆమె కన్నీరు మున్నీరయ్యారు. ఇక్కడ అభ్యర్థిని దించేందుకు వైయస్ జగన్ వర్గం కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇక్కడ అభ్యర్థి ఎంపికను పెండింగులో పెట్టింది. కడపలో వైయస్ జగన్ వర్గం శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి సోదరుడిని రంగంలోకి దింపుతోంది. గెలుపు అవకాశాలున్న చోట్ల వైయస్ జగన్ వర్గం తన అభ్యర్థులను పోటీకి దించుతోంది. దీంతో కాంగ్రెసు విజయావకాశాలు సన్నగిల్లవచ్చునని అంటున్నారు. ఇరు పక్షాల మధ్య ఓట్లు చీలిపోతే తమకు అవకాశాలు పెరుగుతాయని చంద్రబాబు ఆశ పడుతున్నారు.