చంద్రబాబు డ్రామా: రాజీనామాలకు సీమాంధ్ర, తెలంగాణ పోటాపోటీ

సమైక్యాంధ్ర కోసం బలమైన పోరాటం సమైక్యాంధ్ర కోసం బలమైన పోరాటం చేస్తామని టిడిపి సీనియర్లు దాడి వీరభద్రరావు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రకటించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికకు అనుగుణంగా సమైక్యాంధ్రను కొనసాగిస్తూ కేంద్రం తక్షణం నిర్ణయం తీసుకోవాలని డిమాండు చేశారు. సమైక్యాంధ్ర కోసం అవసరమైతే రాజీనామాలకూ తాము సిద్ధమని గాలి ముద్దుకృష్ణమనాయుడు ప్రకటించారు. శాసనసభలో ప్లకార్డులు ప్రదర్శించడం తప్పేమీ కాదని, తమ ప్రాంత ప్రజల ఒత్తిడికి, మనోభావాలకు అనుగుణంగా తాము నడుచుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్ని అనిశ్చితికి కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీయే కారణమని ధ్వజమెత్తారు.
తెలంగాణ కోసం తామూ రాజీనామాలకు సిద్ధమని తెలుగుదేశం తెలంగాణ ఫోరం ప్రకటించింది. తెలంగాణ లేకుండా సమైక్యాంధ్ర అని ఎలా అంటారని ప్రశ్నించింది. తెలంగాణ ఫోరం సమావేశం అనంతరం నాగం జనార్దన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు పాదయాత్ర చేయాలని ఈ సమావేశంలో ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ ప్రతిపాదించారని తెలిసింది. ఆనాడు జవహర్‌లాల్ నెహ్రూ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలిసున్నంత కాలం కలిసుంటారని, కానప్పుడు ఎప్పుడైనా విడిపోయే అవకాశం ఉందని నిజామాబాద్ సభలోనే చెప్పారని, ఈ దృష్ట్యా అక్కడివరకు పాదయాత్ర చేద్దామన్నారు. అయితే శుక్రవారం మరోసారి సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుందామని అనుకున్నారు.