నాగం వ్యాఖ్యలతో చిక్కుల్లో బాబు: మరోసారి మీడియా ముందుకు మోత్కుపల్లి

తెలంగాణవాదానికి, తెలంగాణ తేవడానికి, తెలంగాణ ప్రజల గౌరవాన్ని కాపాడటానికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందని మోత్కుపల్లి నరసింహులు అన్నారు. ఎవరో చెబితే మేం వినడానికి సిద్ధంగా లేమన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టే వరకు మేం పోరాడం చేస్తామని చెప్పారు. నాగం జనార్ధన్ రెడ్డి తనకు తాను గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. అందరి అభిప్రాయమే తన అభిప్రాయమని చెబుతూ తన సొంత పంథాలో వెళుతున్నారన్నారు. మాట చెప్పకుండా, విషయాలు మాతో చర్చించకుండా ద్రోహం చేస్తున్నారన్నారు. నాగం పద్ధతిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. మమ్మల్ని ఇబ్బుందులు పెట్టే విధంగా జనార్ధన్ రెడ్డి వెళుతున్నారన్నారు. తెలంగాణకు మిగతా ఎమ్మెల్యేలు కట్టుబడి లేరనే భావన కల్పించడానికే నాగం ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారన్నారు.
కానీ టిడిపి తెలంగాణకు కట్టుబడి ఉందని చెప్పారు. నాగం తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ కోసం 600 మంది విద్యార్థులు మరణించారన్నారు. తెలంగాణ ప్రజల గౌరవాన్ని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ గౌరవించాలన్నారు. వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా తెలంగాణ కోసం టిడిపి తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామాకు కట్టుబడి ఉన్నారన్నారు. మా రాజీనామాలు తెలంగాణ పోలిటికల్ జెఏసి కన్వీనర్ కోదండరాం వద్దనే ఉన్నాయని మరో ఎమ్మెల్యే అన్నారు. మళ్లీ రాజీనామాలు రాసివ్వడానికి కూడా సిద్ధమని చెప్పారు.