వైయస్ వివేకానంద రెడ్డి రాజీనామా ఉత్త డ్రామానేనా?

ఎన్నికలకు వెళ్లే తనకు మంత్రి పదవి ఎందుకని వైయస్ వివేకానంద రెడ్డి అన్నప్పటికీ ఆయన మంత్రిగా కొనసాగే అవకాశాలే ఉన్నాయి. కాగా, తన వదిన వైయస్ విజయమ్మపై తమ పార్టీ అభ్యర్థిని పోటీకి దించకూడదనే ఆలోచనలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. పులివెందుల శాసనసభా నియోజకవర్గం నుంచి వదిన విజయమ్మపై పోటీ చేయడానికి వివేకానంద రెడ్డి కూడా విముఖత ప్రదర్శిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్థితిలో కడప జిల్లా ఇంచార్జీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ నివాసంలో కడప జిల్లా నాయకుల సమావేశం జరిగింది. కడప పార్లమెంటు సీటుకు, పులివెందుల శాసనసభా నియోజకవర్గానికి అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఉప ఎన్నికలపై తమ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చించేందుకు వైయస్ వివేకానంద రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్తారని సమాచారం.
మంత్రులు అహ్మదుల్లా, డిఎల్ రవీంద్రారెడ్డిలతో పాటు వైయస్ వివేకానంద రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కాంగ్రెసు పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో కుమ్మక్కయిందని, ఇందులో భాగంగానే భూ కేటాయింపులపై సభా సంఘానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించారని జగన్ వర్గం ఎమ్మెల్యేలు వాదిస్తున్నారు. కాంగ్రెసు పార్టీ తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయిందనే ప్రచారాన్ని కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో విస్తృత ప్రచారంలో పెట్టేందుకు జగన్ వర్గం ప్రయత్నిస్తోంది.