పుట్టపర్తి సత్య సాయిబాబా ఆరోగ్యం మరింత ఆందోళనకరం

సత్యసాయి బాబా కిడ్నీల పనితీరు మెరుగుపడటానికి ఆదివారం రాత్రి సీఆర్‌ఆర్‌టీ పరికరంతో అరుదైన శస్త్ర చికిత్స జరిపినట్లు మంత్రులు ఎన్.రఘువీరారెడ్డి, జె.గీతారెడ్డి వెల్లడించారు. దేశంలోనే ఇది అరుదైన శస్త్ర చికిత్సగా పేర్కొన్నారు. బెంగళూరు నుంచి ఈ పరికరాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. సోమవారం బాబా ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వచ్చిన వారిద్దరూ విలేకరులతో మాట్లాడారు. సీఆర్‌ఆర్‌టీ శస్త్ర చికిత్స అనంతరం 48 గంటలపాటు బాబాను వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు వివరించారు. వెంటిలేటరు సహాయంతోనే ఇప్పటికీ ఆయన శ్వాస తీసుకుంటున్నారని చెప్పారు. బాబాకు అత్యాధునిక వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం ఆదివారం రాత్రి రాజధాని నుంచి డాక్టరు అశోక్‌ను (ఫిజీషియన్) పంపించిందని తెలిపారు. ఆయన ఆసుపత్రి వర్గాలతో సమావేశమై బాబా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు వివరించారు.
బాబా ఆరోగ్యం విషమించిందని ఆసుపత్రి వర్గాలు ప్రకటించడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకు సోమవారం రాత్రి పెద్దసంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న జిల్లా కలెక్టరు బి.జనార్దన్‌రెడ్డి కారును అడ్డుకున్నారు. బాబా ఆరోగ్యం గురించి తెలియజేయాలని నినాదాలు చేశారు. ఒక దశలో దాడికి యత్నించారు. గమనించిన డ్రైవరు కారు ఆపకుండా వేగంగా ముందుకుపోనిచ్చారు. దీంతో ప్రమాదం తప్పింది. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications