రాజమండ్రి: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో అప్పుడే లుకలుకలు ప్రారంభమయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెసులో బుధవారం విభేదాలు బయటపడ్డాయి. దీంతో రాజమండ్రి పర్యటనకు వచ్చిన అంబటి రాంబాబుకు చేదు అనుభవం ఎదురైంది. వైయస్ జగన్ వర్గానికి చెందిన కార్యకర్తలు అంబటి రాంబాబును అడ్డుకున్నారు. మొదటి నుంచి వైయస్ జగన్‌కు అనుకూలంగా ఉన్నవారిని వదిలేసి కొత్తవారికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ అంబటి రాంబాబును అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని దెబ్బతీసేందుకు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను సోనియాగాంధీ పావుగా వాడుకుంటున్నారని అంబటి రాంబాబు అంతకు ముందు అన్నారు. జగన్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్ రామోజీరావుతో ఒప్పందం చేసుకున్న విషయం ఉండవల్లికి తెలియకుండా ఉంటుందా అని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. వైఎస్ అనారోగ్యం పాలైనప్పుడు సోనియా పరామర్శించేందుకు నిరాకరించటం ఉండవల్లికి తెలియదా అని అంబటి సూటిగా అడిగారు.