ప్లేటు ఫిరాయించిన ఎమ్మెల్యే కమలమ్మ, మళ్లీ వైయస్ జగన్ వైపు?
Districts
oi-Pratapreddy
By Pratap
|
కడప: కాంగ్రెసులోకి తిరిగి రావడానికి ప్రయత్నాలు చేసిన కడప జిల్లా బద్వేలు శాసనసభ్యురాలు కమలమ్మ ప్లేటు ఫిరాయించినట్లు తెలుస్తోంది. తిరిగి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ వైపు వెళ్లేందుకు సిద్దపడినట్లు చెబుతున్నారు. ఆమె గత రెండు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లారు. సోమవారం రాత్రి నుంచి ఆమె కనిపించడం లేదని అంటున్నారు. మంగళవారం కడప జిల్లా కాంగ్రెసు కమిటీ (డిసిసి) కార్యాలయానికి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమె రాష్ట్ర మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డితో కలిసి మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొనలేదు. గురువారం నుంచి కమలమ్మ కాంగ్రెసు తరఫున ప్రచారం చేస్తారని డిఎల్ రవీంద్రా రెడ్డి చెప్పారు. కానీ ఈలోగా పరిస్థితి తలకిందులైనట్లు తెలుస్తోంది.
గత రెండు రోజులుగా ఆమె తన నియోజకవర్గంలో గానీ, తన స్వగ్రామం పోరుమామిళ్లలో గానీ లేరు. కడప జిల్లా కేంద్రంలో కూడా లేరు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కూడా ఆమె కనిపించలేదు. ఈ స్థితిలో వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు శోభా నాగిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి కమలమ్మ స్వగ్రామం వెళ్లి ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తగిన ప్రాధాన్యం లభించేలా చూస్తామని, కమలమ్మకు నచ్చజెప్పాలని వారు సర్ది చెప్పారు. బద్వేలు నియోజకవర్గంలో తనకు కాకుండా గోవింద రెడ్డికి జగన్ ప్రాధాన్యం ఇవ్వడంపైనే ఆమె అభ్యంతరమని చెబుతున్నారు. ఈ విషయంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు హామీ ఇవ్వడంతో ఆమె వైయస్ జగన్‌తో భేటీ అయ్యేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.